ఎస్ఐ మృతిపై టీడీపీ తప్పుడు ప్రచారం : మంత్రి తానేటి

సర్పవరం ఎస్‌ఐ ముత్తవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య కేసులో తెలుగు దేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను దాచిపెట్టి కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే టీడీపీ ఈ తరహా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. సరైన పోస్టింగ్‌ ఇవ్వకపోవడమే ఆత్మహత్యకు కారణమంటూ చేస్తున్న ఆరోపణల్లో అర్ధం లేదని.. గతంలో టీడీపీ హయాంలో గోపాలకృష్ణ అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇచ్చిందన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.

ఎస్‌ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య కేసులో తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోందని హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం, అబద్దాలు ప్రచారం చేయడం, విషం కక్కడం టీడీపీ దినచర్యగా మారిపోయిందన్నారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విషప్రచారాన్ని ఎల్లో మీడియా భుజాలమీదకెత్తుకుని గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సరైన పోస్టింగ్‌ ఇవ్వక పోవడమే ఎస్‌ఐ ఆత్మహత్యకు కారణమంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారం.. దిగజారుడు తనానికి నిదర్శనమని హోంమంత్రి తేల్చి చెప్పారు.

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా.. ఐపీఎస్ అధికారి కుప్పుస్వామి శశికుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఘటనకు చంద్రబాబు ఏ మాత్రం సిగ్గుతో తలిదించుకున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ఇవాళ మీకు సిగ్గుగా అనిపిస్తుందా అని తానేటి వనిత ప్రశ్నించారు. ఆ రోజు రాజకీయం చేయాలనుకుంటే మేం చేయగలమని, కానీ మేం అలా చేయలేదని చెప్పారు. మీరు మాత్రం ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *