ఇలాంటి హత్య సినిమాలో కూడా చూడలేదు : చంద్రబాబు

టీడీపీ అధికారంలోకి రాగానే టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేస్తామని టీడీపీ జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఐటీడీపీ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాల నుండి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘తెలుగువారే నా కులం, మతం, కుటుంబం. చేతకానివాడు కులం, ప్రాంతం గురించి మాట్లాడతారు. చేతనైనవాడే అభివృద్ధి గురించి మాట్లాడతాడు. నిజాలు వెలికితీయడంలో ఐటీడీపీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలి.

కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటారా?. గత ఎన్నికల సందర్భంగా మాపై తప్పుడు ప్రచారం చేశారు. అవాస్తవాలు, తప్పుడు ప్రచారాల ద్వారా జగన్ గెలిచారు. పేటీఎం బ్యాచ్‍ను అడ్డుపెట్టుకుని టీడీపీపై విషప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో వాస్తవాలు చెప్పి వైసీపీని ఓడించాలి. వివేకాను గొడ్డలిపోటుతో చంపి, గుండెపోటు అని చెప్పారు. ఏ సినిమాలోనూ చూడనట్లుగా బాబాయిని హత్య చేశారు. సిగ్గులేకుండా సీబీఐపై దాడి చేస్తున్నారు.

రూ.40 కోట్ల సుపారీ ఎవరి రక్తచరిత్ర?. బాబాయ్‍ను చంపి మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తారా?. అమరావతి తీర్పును బ్లూ మీడియాలో చూపించలేదు. వాళ్లు చూపించకపోతే ప్రజలకు తెలియకుండా ఆగిందా?. సోషల్ మీడియాకు ఉన్న శక్తి ఏ పాటిదో అందరూ తెలుసుకోవాలి. ప్రజల కష్టాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ఐటీడీపీ సభ్యులపై ఉంది. ఐటీడీపీ సభ్యులపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. భయపడకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి. అధికారంలోకి రాగానే కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తేస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *