వివేకా హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన కల్లూరి గంగాధర్ రెడ్డి అలియాస్ కువైట్ గంగాధర్ రెడ్డి (49) గురువారం  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో ఆయన మరణించారు. నిద్రలోనే ఆయన చనిపోయినట్టుగా గుర్తించిన కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించింది.

మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంగాధర్ రెడ్డి స్వస్థలం పులివెందుల. వివేకా హత్య కేసులో 5వ నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి ఆయన ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. పదేళ్ల క్రితం యాడికికి మకాం మార్చాడు. వివేకా హత్య కేసులో గత ఏడాది అక్టోబర్ 2న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు. కేసు తనపై వేసుకుంటే రూ. 10 కోట్లు ఇస్తానని శివశంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్టు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో గంగాధర్ రెడ్డి పేర్కొన్నాడు.  అయితే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన నిరాకరించాడు. అంతేకాదు, ఆ తర్వాత సీబీఐ అధికారులపైనే అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

అయితే ఇంతకుముందు తనకు ప్రాణముప్పు ఉందని రెండుసార్లు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. గంగాధర్ రెడ్డి రాత్రి నిద్రలోనే మృతిచెందినట్లుగా చెబుతున్నా అనుమానాస్పద మృతి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పులివెందులలో రౌడీషీటర్ జాబితాలో ఉన్న గంగాధర్‍రెడ్డి గతంలో కడప జిల్లా బహిష్కరణకు గురయ్యాడు. గంగాధర్‍రెడ్డిపై 2006లో పులివెందుల పీఎస్‍లో ఘర్షణ కేసు నమోదైంది. 2007లో జంటహత్యల కేసు, 2008లో ఘర్షణ కేసు నమోదుకాగా, గంగాధర్ రెడ్డిపై 2011లో సూసైడ్ కేసు నమోదు అయింది. ఇప్పుడు ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *