చంద్రబాబు హయాంలో ఇస్తున్న బ్రాండ్‍లు ఏంటి.? : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల

ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భజన జరుగుతోందని పీఏసీ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయం ముట్టడికి బుధవారం బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి గన్నవరం మండలంలోని ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ..  శాసన సభలో తమకు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలు కాదని, సారా మరణాలేననని స్పష్టం చేశారు. సహజ మరణాలైతే పురుషులే ఎందుకు చనిపోతారని ప్రశ్నించారు.

సారా మరణాలపై సభలో టీడీపీ సభ్యులు ఉన్నప్పుడే చర్చించొచ్చు కదా ప్రశ్నించారు.  చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో డిబెట్ పెట్టాలని సవాల్ విసిరారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ఇప్పటికీ చర్చకు తాము సిద్ధమేనన్నారు. జే బ్రాండ్‍లు ఎక్కువగా ఉన్నాయనేదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. ప్రతి షాపు నుంచి మూడు శాంపిల్స్ సేకరించాలని, రెండు శాంపిల్స్ ను వేర్వేరు ల్యాబ్‍లకు పంపండని తెలిపారు. మరో శాంపిల్‍ను కోర్టులో డిపాజిట్ చేయండని వివరించారు.

చంద్రబాబు హయాంలో ఇస్తున్న బ్రాండ్లు ఏంటని, టీడీపీ హయాంలో ఎప్పుడూ బ్రాండ్‍లపై చర్చ జరగలేదని గుర్తు చేశారు. ఏ బ్రాండ్ అమ్మాలో అధికారులు డిసైడ్ చేశారని ఆరోపించారు. సారా మరణాలపై ప్రభుత్వం తప్పుడు రిపోర్టును ప్రజల ముందు ఉంచుతోందని మండిపడ్డారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఎందుకు పరామర్శంచలేదని ప్రశ్నించారు. బాధితుల దగ్గరకు వెళ్లాలంటే ముఖ్యమంత్రి, మంత్రులు భయపడుతున్నారని తెలిపారు. సారా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందని, రూ.25 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *