నేను కమ్మ వాడినే.. టీడీపీ కాదు : బండ్ల గణేష్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డికి కులం నచ్చకుంటే, కమ్మవాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టాలని అన్నారు.  చంద్రబాబు, టీడీపీని అడ్డంపెట్టుకుని కమ్మవారిని తిట్టకండని హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదు.. రేపు మీరు కూడా మాజీ అవుతారు అంటూ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్లో పోస్టు పెట్టారు.  ప్రతి కమ్మ వారు టీడీపీ కాదు, నేను కమ్మ వాడినే.. టీడీపీ కాదని స్పష్టం చేశారు. ఆంధ్రాకి పట్టిన అష్ట దరిద్రమా, నీ పిచ్చికి, నీ కుల పిచ్చికి నీ డబ్బు పిచ్చికి కమ్మ కులాన్ని బలిచేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

చంద్రబాబుతో విభేదాలు ఉంటే ఆయనతో తేల్చుకో అంటూ మండి పడ్డారు. విశాఖలో దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ కొనుక్కోమని విమర్శించారు. వ్యక్తిమీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచి చూపిస్తారని హెచ్చరించారు. టీడీపీ కులపార్టీ అయితే మీరెందుకు కమ్మవారికి టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నావు..  అది మీకు మంచిది కాద అంటూ ఫైర్ అయ్యారు.

అయితే నిన్న విజయసాయిరెడ్డి టీడీపీ కులపార్టీ అంటూ విమర్శించారు. దీనికి బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. కమ్మ కులాన్ని తిడుతున్నారని నిన్ననే నిజామాబాద్ లో కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా ఫైర్ అయ్యారు. అమరావతిని కమ్మరావతి అంటూ విమర్శిస్తున్నారని, దమ్ముంటే అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టాలసిన సవాల్ విసిరారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *