పర్సెంటా..అరపర్సెంటా అని వాగిన వ్యక్తి మాటలు చూస్తే..!: దేవినేని ఉమ

బుల్లెట్ దిగుద్ది, పర్సెంటా..అరపర్సెంటా అని వాగిన వ్యక్తి ఇప్పుడు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి మూడేళ్లు సమయం పడుతుందనడం చూస్తే పోలవరంను లిఫ్ట్ ఇరిగేషన్ గా మార్చేందుకేనని అర్థమవుతోందని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సైతం నీటి పారుదల మంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర జలవనరుల శాఖామంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ ప్రాజెక్టు ప్రాంతంలో ఎందుకు మీడియాతో మాట్లాడలేకపోయారని ప్రశ్నించారు.

అసెంబ్లీలో మంత్రి అనిల్ కుమార్ బుద్ధిజ్ఞానం లేకుండా మాట్లాడితే సరిపోతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టుకు రూ.11వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.  వాటిల్లో రూ.4 వేల కోట్ల పనులకు సంబంధించిన నిధులను వైసీపీ వచ్చాకే కేంద్రం విడుదల చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం పనుల్లో అవినీతి జరిగితే కేంద్ర ప్రభుత్వం రూ.4వేలకోట్లను ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చారని ప్రాజెక్ట్ పనులు ఆపేసి, సింగిల్ టెండర్లకు పనులు కట్టబెట్టి, అవినీతి కోసం రాష్ట్ర రైతాంగం జీవితాలతో ఆడుకుంటారా? అని ప్రశ్నించారు.

పోలవరం పనుల వ్యవ హారంపై వైసీపీప్రభుత్వం ఆడిననాటకాలపై విచారణ జరిపిస్తే అధి కారంలోఉన్నవారు భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయమన్నారు. పెంటపాటి పుల్లారావు అనే వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తే, దానిపై కేంద్రజలవనరుల శాఖ సుప్రీంకోర్ట్ లో వేసిన అఫిడవిట్ లో పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పిందని గుర్తు చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ ప్రకారం, కేంద్ర జలవనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారమే టీడీపీ ప్రభుత్వంలో పనులు జరిగాయని స్పష్టంగా చెప్పారన్నారు. బుద్ధిలేని ప్రభుత్వం పోలవరం ఎడమ కాల్వలో మట్టి తవ్వుకుంటూ మూడేళ్ల సమయాన్ని వృథా చేసిందని ఆరోపించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *