నాకు మంచి పేరొస్తుందని అడ్డంకులు సృష్టించారు : సీఎం జగన్

ప్రతీ కుటుంబానికి శాశ్వత చిరునామా ఉండాలన్నదే తన లక్ష్యమని, అర్హులైన ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ ఆగ్రహారంలో 1.23 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్షా79 వేల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు.  ఇవాళ 3 లక్షల 3వేల మందికి ఇల్లు కట్టుకునేందుకు మంజూరు పత్రాలు ఇస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 2 లక్షల 67 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది వివరించారు. రాష్ట్రంలో మొత్తం 21 లక్షల 20 వేల ఇళ్లు నిర్మిస్తున్నామని వివరించారు.  రెండో దశ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చామని, మన ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపుమంటతో రగిలిపోతున్నారని ధ్వజమెత్తారు.

‘‘జగన్ కు ఎక్కడ నుంచి పేరు వస్తుందోనని అడ్డంకులు సృష్టించారు. అన్ని అడ్డంకుల్ని అధిగమించి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 16 నెలల తర్వాత పేదల కల సాకారం అవుతోంది. ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్రంలో ఇంటి అడ్రస్ లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండకూడదు. ప్రతి అక్క చెల్లెమ్మల చేతిలో రూ.10 లక్షల విలువైన ఆస్తి పెట్టాం. ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్నాం. ఇల్లు రాలేదని ఎవరూ బాధపడొద్దు – ఇల్లు రానివారు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి – అర్హత పరిశీలించి ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత నాది.

ప్రతీ ఒక్కరికి పథకాలు ఎలా ఇవ్వాలన్న తాపత్రయమే తప్పితే కోత విధించాలన్న ఆలోచన నాకు లేదు. ఇంటి స్థలాల రూపంలో రూ.35 వేల కోట్లు అక్క, చెల్లెమ్మలకు ఇస్తున్నాం. కోటి 20 లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. రాష్ట్ర జనాభా ప్రకారం ప్రతీ నలుగురిలో ఒకరికి ఇల్లు కట్టిస్తున్నాం. ఇల్లు కట్టించి ఇవ్వడమే కాదు రెండు ఫ్యాన్లు, 4 ఎల్ఈడీ బల్బులు ఉచితంగా ఇస్తున్నాం. పేదలకు ఇళ్లు కట్టించేందుకు చంద్రబాబుకు మనసు రాలేదు. గత ప్రభుత్వం పేదల కోసం ఆలోచించలేదు. పేదలకు ఏ మంచి జరిగినా దుష్టచతుష్టయానికి కళ్లు మంట. లంచాలు లేని వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం.’’ అని తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *