ప్రతి మహిళ చేతికి రూ.5 లక్షల ఆస్తి : సీఎం జగన్

వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై గురువారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పేదలకు 30.76 లక్షల ఇళ్ల  పట్టాలు అందజేశామని తెలిపారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ‘‘ప్రతి మహిళ చేతికి రూ.5 లక్షల వరకు ఆస్తిని ఇచ్చాం. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం మహాయజ్ఞం చేశాం.

రూ.25 వేల కోట్ల విలువైన 71,811 ఎకరాల భూమిని పేదలకు అందించాం. 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందజేశాం. ఇళ్ల నిర్మాణంలో 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయి. తొలి దశలో పది వేలకు పైగా జగనన్న కాలనీల నిర్మాణం. ఇళ్లు కాదు.. ఏకంగా ఉళ్లనే నిర్మిస్తున్నాం. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు. పేదల ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్.. ఇళ్ల నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం. పేదల అభ్యున్నతికి మా ప్రభుత్వం పాటుబడుతోంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి.

గతంలో టిడ్కో ఇళ్లపై పేదలు నెలకు రూ.3 వేలు కట్టాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇప్పటికే లక్షకుపైగా టిడ్కో ఇళ్లు పూర్తి చేశారం. మరో 63 వేల టిడ్కో ఇళ్లు చివరిదశలో ఉన్నాయి. వచ్చే డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. నిరుపేదలను ఇంటి యజమానులు చేయడమే మా లక్ష్యం. పేదల కళ్లలో ఆనందం, సంతోషమే మాకు శక్తిని ఇస్తుంది’’ అని జగన్ ప్రసంగించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *