న్యాయం జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్సీ అశోక్ బాబు

ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి మాటతప్పి, మడమతిప్పడమేకాకుండా, వారిని దారుణంగా వంచించాడని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు విమర్శించారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత మోసం ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి చేశాడని ఆరోపించారు. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి, ఉద్యోగులకు పంగనామాలుపెట్టాడని ఎద్దేవా చేశారు. సీపీఎస్ బదులుగా జీపీఎస్ అంటూ నేడు పత్రికా ప్రకటనల్లో ముఖ్యమంత్రి చెప్పినదంతా  పచ్చి బూటకమని కొట్టి పారేశారు.  ఉద్యోగులు రోడ్లపైకి వస్తే అణచివేయడం.. ఉపాధ్యాయులను బెదిరించడం.. ఇదీ జగన్ పాలనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినహెల్త్ కార్డులు ఆ సిబ్బందికి ఉపయోగపడటం లేదన్నారు.

ప్రజలు, ఉద్యోగులు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ కార్డుల కిందసేవలుపొందలేక నానా అవస్థలుపడుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్ మెంట్ ఊసే లేదని, జగన్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగికి న్యాయంజరిగిందని నిరూపించినా, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు మంచి చేశామని ఏ అధికారి, మంత్రైనా ఆధారాలతో నిరూపిస్తే వారు చెప్పింది చేయడానికి తాను సిద్ధమని అన్నారు. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన జీవో ఇవ్వలేదన్నారు. వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్న పోలీసులకి సరండర్ లీవులు, ఎన్ క్యాష్ మెంట్లు ఏవీ లేవన్నారు.

కరోనా సమయంలో పనిచేసిన వైద్య సిబ్బంది, మున్సిపల్ వర్కర్స్ ని వేధిస్తున్నారని, జాబ్ క్యాలెండర్ విడుదల…ఏటా డీఎస్సీ అన్నారు.. పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తామన్నారు.. అవన్నీ ఉత్తుత్తి మాటలుగానే మిగిలాయన్నారు. నైతికత..నిజాయితీ అనే పదాలకు జగన్మోహన్ రెడ్డికి అర్థం తెలిస్తే, ఆయన తక్షణమే ప్రభుత్వం రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఇవ్వలేని వారు జీపీఎస్.. ఆర్పీఎస్ పేరుతో కొత్తకొత్త పదాలు తెరపైకి తెస్తే, ఉద్యోగులంతా తగిన సమయంలో ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *