ఇదెక్కడి విడ్డూరం.. తనను పుట్టించిన డాక్టర్ పై కేసు వేసి గెలిచిన మహిళ… ఎక్కడంటే?
సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు వారి జెండర్ తెలియచెప్పి వారికి అబార్షన్ చేసినప్పుడు లేదా పిల్లలు కలగకుండా ఏవైనా డాక్టర్లు తప్పు చేసినప్పుడు వారిపై చాలా మంది కేసు వేసి డాక్టర్లపై చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ 21 సంవత్సరాల ఏవీ టూంబెస్ అనే మహిళ తనని పుట్టించినందుకు డాక్టర్ పై కేసు వేసి ఈ కేసులో తాను గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ తను డాక్టర్ పై కేసు వేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
సాధారణంగా గర్భం దాల్చడానికి ముందుగా కొన్ని సప్లిమెంట్స్ వాడాలని డాక్టర్లు సూచిస్తారు. ఈ క్రమంలోనే కొందరు ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి వాటిని ఉపయోగించి అనంతరం గర్భం ధరిస్తారు. ఇలా ముందుగా సప్లిమెంట్స్ వాడటం వల్ల గర్భంలో పెరిగే బిడ్డ ఎదుగుదల ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఏవీ విషయంలో ఇలా జరగలేదు. తన ఫ్యామిలీ డాక్టర్ తన తల్లికి సప్లిమెంట్స్ వాడాలని సూచించకపోవడం వల్ల తన తల్లి గర్భం దాల్చింది.
ఈ క్రమంలోనే ఏవీ జన్మించడంతోనే స్పినా బిఫిడా అనే సమస్యతో బాధపడుతోంది. స్పినా బిఫిడా అంటే వెన్నెముక సమస్యతో జన్మించడం వల్ల ఆమె పూర్తిగా వీల్ చైర్ కి పరిమితం అయింది. దీంతో గత 20 సంవత్సరాల నుంచి ఎంతో నరకం అనుభవిస్తున్న ఈమె ఈ విధమైనటువంటి సమస్యను ఎదుర్కోవడానికి గల కారణం తన ఫ్యామిలీ డాక్టర్ అని భావించి ఆమెపై కేసు వేశారు. ఈ కేసు గురించి విచారణ జరిపిన లండన్ కోర్టు డాక్టర్ ది తప్పు అని పరిగణించి తీర్పు వెల్లడించారు. దీంతో తను తప్పు చేసినందుకు గాను ఆమెకు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు అయితే ఆ పరిహారం ఎంత చెల్లించాలనే విషయం ఇంకా వెల్లడించలేదు.