నన్ను గ్యాస్ సిలిండర్ అని కామెంట్ చేసేవాళ్లు: రాశీ ఖన్నా
మద్రాస్ కేఫ్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన రాశీ ఖన్నా… తర్వాత ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అది హిట్ కావడంతో వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడే సెటిలైపోయింది. తెలుగు, తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. ఇక సుమారు 9 ఏళ్ల తర్వాత రుద్ర వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా ఓ బీటౌన్ ఎంటర్టైన్మెంట్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
తన కెరీర్లో దక్షిణాది వాళ్లు తనని గ్యాస్ ట్యాంకర్ అంటూ అవహేళన చేశారని నటి రాశీఖన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటివరకూ కెరీర్ పరంగా మీరు ఎదుర్కొన్న విమర్శలు ఏమిటి? అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘కెరీర్ ఆరంభమైన కొత్తలోనే మంచి పాత్రల్లో నటించే అవకాశం లభించింది. అందుకు ఎంతో సంతోషిస్తున్నా. అదే సమయంలో శరీరాకృతి పరంగా నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. చూడటానికి లావుగా ఉండటంతో దక్షిణాదిలో చాలామంది నన్ను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవారు. కొంతకాలం గడిచే సరికి సన్నగా మారాలని నిర్ణయించుకున్నా. ఫిట్ అయ్యాను. నేను చేస్తున్న వృత్తికి నాజుకుగా ఉండటం ఎంతో అవసరమని అర్థమైంది అందుకే సన్న బడ్డా. అంతేకానీ వాళ్ల నోళ్లు మూయించడం కోసం సన్నగా మారలేదు. ఆన్‌లైన్‌లోనూ ఇలాంటి విమర్శలే ఎదురైనప్పటికీ నేను ఏమాత్రం బాధపడలేదు’’ అని రాశీఖన్నా తెలిపింది.
తనకు PCOD సమస్య ఉందని.. అందువల్లే తన బరువును కంట్రోల్ చేయలేనని తెలిపింది. తాను స్క్రీన్ మీద ఎలా కనిపిస్తానని మాత్రమే చూస్తారని.. కాబట్టి వారిని నిందించలేనని అన్నారు. మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కున్నా. ‘నేను ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్. కాబట్టి వాటిని మైండ్లోకి తీసుకోలేదు’ అని రాశీ పేర్కొంది.