రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకి లేదు : హైకోర్టు

రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.  మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. ఏడాదిన్నరగా రాజధానిపై వాదనలు కొనసాగుతున్నాయి. కోవిడ్ కారణంగా విచారణను కొన్ని రోజుల పాటు వాయిదా వేసి ఇటీవల ప్రారంభించింది. అయితీ ఈ తీర్పులో ప్రభుత్వానికి హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది.  అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి తెలిపింది.

మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలని ఆదేశించింది. ఆరు నెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని, ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలని ఆదేశించింది. అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని తెలిపింది. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంది. రాజధాని అవసరాలకే భూమిని వినియోగించాలని,  రాజధాని భూములను ఇతర అవసరాలకు తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని, పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాలను తరలించకూడదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో రైతులు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటానికి న్యాయ దేవత తమ వైపు నిలిచిందంటున్నారు. రాజధాని గ్రామాల్లో రైతులు సంతోషాల్లో మునిగిపోయారు. హైకోర్టు తీర్పును వైసీపీ మినహా అన్ని పార్టీలు స్వాగతించాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం తీర్పును స్వాగతించింది. ప్రభుత్వ దుశ్చర్యకు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని, ఇప్పటికైనా మూడు ముక్కల నాటకాన్ని వీడి రాజధానిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *