జగన్ రెడ్డి కేసులే పోలవరానికి శాపం : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల

సీఎం జగన్మోహన్ రెడ్డి చేతగానితనం, అసమర్థత, కేసులే పోలవరానికి శాపంగా మారాయని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేళ్లలో ప్రాజెక్ట్ పనులు మూడు శాతంకూడా చేయలేకపోయారని మండిపడ్డారు.  చంద్రబాబు పోలవరం పనుల్లో అవినీతిచేస్తే, అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఏం పీకావని మండిపడ్డారు. పోలవరం పూర్తికాకపోవడానికి చంద్రబాబే కారణమని ఇప్పటికీ అసెంబ్లీలో పచ్చిఅబద్ధాలు చెబుతూ అసమర్థత, చేతగానితనాన్ని, చంద్రబాబుపై నెట్టేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి షెకావత్ ఇటీవల పోలవరం సందర్శనకు వచ్చినప్పుడు, రెండేళ్లలో 2.84శాతం పనులే జరిగాయని జగన్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను ఏదో ఉద్ధరించినట్లుగా ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు టీడీపీ సభ్యులను బయటకు పంపిమరీ డబ్బాలు కొట్టుకున్నారని మండిపడ్డారు. పోలవరం పేరు ఎత్తే నైతిక అర్హత కూడా జగన్ రెడ్డికిలేదన్నారు. 2004 నుంచి 2014 మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎంత వరకు పూర్తయ్యాయో కేంద్ర ప్రభుత్వమే గతంలో నివేదికలతో సహా వాస్తవాలు చెప్పిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 10, 2020లో చేసిన సమీక్షలో 41.10శాతం పనులు జరిగాయన్నాయన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2020 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తికావాలన్న ఒకే ఒక లక్ష్యంతో పనిచేశారని, కానీ జగన్మోహన్ రెడ్డి పోలవరంపై తొలిసారి మాట్లాడినప్పుడు 2021 జూన్ లో పూర్తి చేస్తామన్నాడని, తరువాతేమో 2021 డిసెంబర్ అన్నాడని, ఇప్పుడేమో 2023 ఖరీఫ్ అని అసెంబ్లీలో చెప్పాడని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మా‎ణానికి సంబంధించిన ప్రతి డిజైన్ ను కేంద్ర ప్రభుత్వ విభాగంలోని డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీనే నిర్దారిస్తుందన్నారు. చంద్రబాబు ఎక్కడా తన వ్యక్తిగతస్వార్థంకోసం ప్రాజెక్ట్ ని బలి పట్టలేదన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *