సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చిన కర్ణాటక సీఎం
భావోద్వేగాలు మనిషికి సహజం. అందులోనూ వాటిని తెర మీద చూసినప్పుడు మరింత భావోద్వేగానికి లోనవుతుంటారు. అలాగే ‘777 చార్లీ’ సినిమా చూసి ఉద్వేగానికి గురయ్యారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. ఈ చిత్రం తన పెంపుడు శునకాన్ని గుర్తు చేసిందని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. 14ఏళ్ల పాటు బస్వరాజు కుటుంబంతో మమేకమైన ఆ శునకం గతేడాది మరణించింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా దానికి కన్నీటి వీడ్కోలు పలికారు. తాజాగా ‘777 చార్లీ’ చిత్రం చూస్తున్నంత సేపూ తన పెంపుడు శునకమే గుర్తుకు వచ్చిందని దానితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 777 ఛార్లి. జూన్ 10న ఈ చిత్రం… కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్.గుప్తాతో కలిసి తన పరమ్ వహ్ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. కిరణ్ రాజ్.కె దర్శకుడు. సంగీత శ్రింగేరి ఇందులో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను 167 రోజుల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. అయితే సోమవారం సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసి సీఎం బసవరాజ్ బొమ్మై ఒక్కసారిగా ఏడ్చేశారు.
శునకం మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి.. కానీ ఈ చిత్రంలో ఒక జంతువులో ఉండే ఎమోషన్‌ను బాగా చూపించారని బొమ్మై అన్నారు. అది కళ్లతోనే తన భావాలను పలికించిందని.. ఇది అందరూ చూడాల్సిన చిత్రం అని చెప్పారు. కుక్క ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ, చాలా స్వచ్ఛమైనది అంటూ.. తన పెంపుడు కుక్కను గుర్తుచేసుకుంటూ సీఎం కన్నీళ్లను ఆపుకోలేక పోయారు. మీడియాతో మాట్లాడుతూనే బోరుమని విలపించారు. దీనికితోడు ఈ సినిమా చూస్తూ థియేటర్ లో ఏడుస్తున్న ముఖ్యమంత్రి ఫోటో ఒకటి బయటికి వచ్చింది. అది వైరల్ గా మారింది. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కొద్దిరోజుల ముందు ఆయన పెంపుడు కుక్క మరణించింది.
Okayyyyy…. I think I like our CM much more now. This is when they lost ‘Sunny’- their 14 year old family dog. #BasavarajBommai pic.twitter.com/4ECmQMdLA6
— Sangita (@Sanginamby) July 29, 2021