ఐదుగురు టీడీపీ సభ్యులు సస్పెండ్

అసెంబ్లీ నుండి ఐదుగురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. జంగారెడ్డిగూడెంలో సంభవించిన సారా మరణాలపై సోమవారం అసెంబ్లీలో చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. సభ మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు సభను అడ్డుకున్నారు. వెల్‌లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి స్పీకర్ పై ప్రతులు విసిరేశారు. ప్రశ్నోత్తరాలు జరిగిన తర్వాత.. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పినా.. టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు.

టీడీపీ సభ్యులు తమ సీట్లలోకి వెళ్లకపోవడంతో సభ కాసేపు వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభమైనా టీడీపీ సభ్యులు మళ్లీ ఆందోళన చేయడంతో స్పీకర్ సీరియస్‌ అయ్యారు. పోడియం చుట్టూ చేరి ఆందోళన చేయడంతో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీఎల్పీ నేత అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, రామానాయుడు, డీబీవీ స్వామిని సస్పెన్షన్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు.

ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అనంతరం ఆందోళన చేస్తున్న సభ్యులను మార్షల్స్ వచ్చి బటయకు ఎత్తుకు పోయారు. ఇదే విషయమై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రసంగిస్తుండగా మిగిలిన టీడీపీ సభ్యులు చర్చకు అవకాశం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సీనియర్ సభ్యులు ఇంత మంది ఉండి.. సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదంటూ స్పీకర్ తమ్మినేని సూచించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *