సొమ్మొకడిది, సోకొకడిదిలా ఉంది జగన్ వైఖరి : యనమల

ముమ్మడివరం నియోజకవర్గం మురుముళ్లలో సిఎం జగన్ రెడ్డి చెప్పిన మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. ‘‘సొమ్మొకడిది సోకొకడిదిలా ఉంది జగన్ వైఖరి. ఓఎన్ జిసి పైపులైన్లతో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం కేంద్రం ఇచ్చేది. అదేదో తానే సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు జగన్ ఫోజులు కొట్టడం హాస్యాస్పదం. కేంద్రనిధులు కేంద్రానికి చెందినవారిని పిలవకుండా అదేదో తన ఘనకార్యంగా చెప్పడం విడ్డూరం. మత్స్యకారులకు ఈ పరిహారాన్ని 6నెలలుగా తొక్కిపట్టారు. ఇప్పుడిచ్చింది కూడా ఇవ్వాల్సిందానిలో సగమే.. 6నెలలుగా పరిహారం ఇవ్వకుండా తొక్కిపట్టడం మత్స్యకారులను జగన్మోసం కాదా..? సగం మాత్రమే ఇచ్చి మిగిలిన సగం పెండింగ్ పెట్టడం జగన్మోసం కాదా..?

సాక్షి మీడియా యాడ్స్ చెల్లింపుల్లో సగం ఇలాగే పెండింగ్ పెట్టారా..? సొంత మీడియాకో న్యాయం, మత్స్యకారులకో న్యాయమా..? మల్లాడి సత్యలింగ నాయకర్ పేరెత్తే అర్హత మీకుందా..? ఎంఎస్ ఎన్ ట్రస్ట్ ఆస్తులు కూడా కబ్జా చేయాలని మీరు చూడలేదా..? టిడిపి అడ్డుకోవడంతో వెనక్కి తగ్గడం నిజం కాదా..?  మత్స్యకారులను కాల్చి చంపిన చరిత్ర వైసిపిదైతే, వారిని ఆదుకున్న ఘనత టిడిపిది..వేట నిషేధ సమయంలో పరిహారం రెట్టింపు చేసిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే.

డీజిల్ రాయితీ బకాయిల్లేకుండా చెల్లించింది మేమే..మత్స్యమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసింది, ఫిష్ మార్కెట్లు నెలకొల్పింది, పట్టాలిచ్చింది, ఇళ్లు నిర్మించింది మేమే.. జగన్ రెడ్డి మాటలు తేనెపూసిన కత్తులు.. మాయమాటలతో ఎన్నాళ్లు మోసం చేస్తారు మీరు..? మీకు, మాకూ తేడా ఏంటో చెప్పాలా..? రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించింది మేమైతే విధ్వంసం చేసింది మీరు.. ఆస్తుల కల్పన చేసింది మేమైతే అప్పుల్లో ముంచింది మీరు.. రెండంకెల వృద్ధి సాధించింది మేమైతే, మైనస్ గ్రోత్ తెచ్చింది మీరు..మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేసింది మేమైతే, పవర్ కట్స్ రాష్ట్రంగా చేసింది మీరు’’అని మండిపడ్డారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *