గన్నవరంలో వంశీని ఓడిస్తాం..వైసీపీ కార్యకర్తల లేఖలు
గన్నవరం వైసీపీలో మళ్లీ ముసలం మొదలైంది. వంశీ వ్యవహార శైలిపై ఎంపీ విజయసాయిరెడ్డికి ఆ పార్టీ కార్యకర్తలు లేఖలు రాశారు. వైసీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే వల్లభనేని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా కార్యకర్తలు వినతిపత్రాలు రాశారు. వాలంటరీల విషయంలో వల్లభనేని జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. చాలా తక్కువ ఓట్లతో యార్లగడ్డ వెంకట్రావ్ ఓటమి చెందారని, తమ నేతలపై ఎమ్మెల్యే వల్లభనేని అనుచరుల పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పడు ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
నియోజకవర్గ బాధ్యతలు వంశీకి తప్ప ఎవరికి కేటాయించినా.. 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని లేఖలో పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల పాటు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని కాపాడామని వారు పేర్కొన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే.. టీడీపీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ.. వైకాపాకు మద్దతు ప్రకటించారని ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ జెండా మోసిన వైకాపా కార్యకర్తలు.. ఇప్పటికీ అక్రమ కేసుల వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా కుదేలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి నియోజకవర్గ బాధ్యతలను.. వల్లభనేని వంశీకి తప్ప ఎవరికి కేటాయించినా.. 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని లేఖలో పేర్కొన్నారు.
నియోజకవర్గంలో పార్టీని కాపాడేందుకు సత్వరమే నూతన ఇన్ఛార్జ్ని నియమించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అయితే వంశీ అధికారికంగా వైసీపీ కండువా వేసుకోలేదు. కొడాలి నానితో వెళ్లి జగన్ తో సమావేశమైనప్పటి నుండి చంద్రబాబు, లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇటీవల భువనేశ్వరిని వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించడానికి ముందు లోకేష్ పోలికల గురించి మొదట ఆరోపించింది వంశీనే. ఇది టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించింది. అయితే వంశీకి వైసీపీలో సీటు లేనట్లేనని వెంకట్రావు వర్గం చెప్తుంటే..మళ్లీ వంశీనే పోటీ చేస్తారని ఆయన వర్గం చెప్తోంది.