‘చంద్రముఖి’ సినిమాకి సీక్వెల్… ఎవరెవరు నటిస్తున్నారంటే..!

కోలీవుడ్ దర్శకుడు పి. వాసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాలైనా, భక్తి సినిమాలైనా ఆయనకు కొట్టిన పిండి. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమాను ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేడు.  ‘చంద్రముఖి’ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకొని రజినీ, ప్రభు, జ్యోతిక కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని చాలా రోజులుగా ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. కానీ అధికార ప్రకటన మాత్రం రాలేదు. రజినీకాంత్ సీక్వెల్ లో నటించడానికి ఆసక్తి చూపించడం లేదని కాబట్టి మరో హీరోతో సినిమా చేసే ఛాన్స్ ఉందని అన్నారు.

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతోందని అధికారిక ప్రకటన వెలువడింది. లారెన్స్‌ కీలక పాత్రలో ‘చంద్రముఖి-2’ తెరకెక్కనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కర్‌న్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మేక‌ర్స్ ఈ ప్రాజెక్టును ప్ర‌క‌టిస్తూ..టైటిల్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.‘ముని’ సిరీస్‌లో హారర్‌ ఫిల్మ్స్‌తో అదరగొట్టారు లారెన్స్‌. ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్‌లో ఆయన నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.

పార్ట్ 1లో నటించిన కమెడియన్ వడివేలు పార్ట్ 2లో కూడా కనిపించబోతున్నారు. మరి మిగిలిన తారలను కూడా రిపీట్ చేస్తారేమో చూడాలి. ఈ ప్రాజెక్టులో ఓ అందాల తార ఫీ మేల్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఇంత‌కీ ఆ క్రేజీ ఆఫ‌ర్‌ను ఏ భామ కొట్టేస్తుందోన‌ని ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు సినీ జ‌నాలు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *