చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా బయట తిరుగుతున్నారు : మంత్రి అంబటి రాంబాబు

ఫ్రస్టేషన్‍తో చంద్రబాబులో కొత్త మనిషి కనిపిస్తున్నాడని, వాలంటీర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా బయట తిరుతూ ప్రజల్ని విసిగిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి జగన్‌ కారణమని చంద్రబాబు మహానాడు, మినీ మహానాడులో  విమర్శలు చేశారని, అలాంటి సీనియర్‌ నాయకులు ఆ విధంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి ముమ్మాటికి చంద్రబాబే కారణం అని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.

ఇప్పటికైనా దమ్ముంటే, చంద్రబాబుకు సిన్సియారిటీ ఉంటే.. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ జగన్‌ వల్లనే కొట్టుకుపోయిందనుకుంటే, శాసనసభకు రావాలన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభకు రాకుండా బయట సుదీర్ఘ ఉపన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్న ఒంగోలులో మహానాడు, చోడవరంలో మినీ మహానాడు, ఇప్పుడు నెల్లిమర్లలో అబద్ధాలు ఊదుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చోటా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడని, తెచ్చి పెట్టుకున్న ఆవేశం, తన స్థాయి మర్చిపోయి దిగజారి మాట్లాడే మాటలు చూస్తుంటే జాలేస్తోందన్నారు.

ఎన్ని గుంటనక్క చేష్టలు చేసి అధికారంలోకి వచ్చి, 14 ఏళ్లు సీఎంగా రాష్ట్రాన్ని పరిపాలించారని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి తీవ్రవాదిలాగా తయారయ్యాడని, ఎమ్మెల్యేలు ఆస్తులు కబ్జా చేస్తున్నారని, క్విట్‌ జగన్‌. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని చంద్రబాబు ఏ విధంగా అంటారని ప్రశ్నించారు.  ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని, అందుకే చంద్రబాబు గర్జిస్తున్నాడని అన్నారు.  చంద్రబాబు, ఎల్లోమీడియా ఒక ఉద్యమాన్ని చేపట్టాయని, మళ్లీ అధికారంలోకి రాలేమని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే ఎల్లోమీడియా తాపత్రయమంతా అని మండిపడ్డారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *