ఎన్టీఆర్ ను చంపి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు : వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు

చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్టీఆర్ ను చంపి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసిన అరాచకాలపై చర్చ జరగాల్సి ఉందని తెలిపారు. చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేసిన విధానంపై ఖచ్చితంగా చర్చ జరగాలని పేర్కొన్నారు. బీసీలకు టీడీపీ హయాంలో జరిగిన అన్యాయంపైనా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 29న చంద్రబాబు అరాచకాలను ప్రజలకు, మేథావులకు వివరిస్తామని తెలిపారు. టీడీపీ 40 ఏళ్లలో చేయలేనిది.. 34 నెలల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని అభిప్రాయపడ్డారు. లోకేశ్ మా స్థాయి కాకపోయినా కూడా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడతాయని స్పష్టం చేశారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణ జరుగుతుందని స్పష్టం చేశారు.

చంద్రబాబు మాత్రం అమరావతే అభివృద్ధి కావాలంటున్నారని విమర్శించారు. సాధారణ మరణాలను సారా మరణాలంటూ టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఎన్టీఆర్ మద్య నిషేధం చేస్తే చంద్రబాబు నాయుడు దాన్ని ఎత్తేశారని విమర్శించారు. చంద్రబాబు మద్యం విధానంపై కూడా చర్చ జరగాలని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని, వచ్చే ఎన్నికల్లోనూ వైసీసీనే అధికారం చేపడుతుందని ప్రకటించారు. ఎంత మంది కలిసి వచ్చినా ఢీ కొట్టే దమ్మున్న మొనగాడు జగన్ అని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారని జోష్యం చెప్పారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *