నూతనోత్సాహాన్ని చాటేలా మహానాడు : చంద్రబాబు

టీడీపీ మహానాడు కార్యక్రమ నిర్వహణ వేదిక పై క్లారిటీ వచ్చింది. ఒంగోలులోని మీని స్టేడియం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో మొదట పరిశీలించిన మండువారి పాలెంలోనే మహానాడు నిర్వహణకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం రెవెన్యూ విలేజ్ పరిధిలో….త్రోవగుంట ప్రాంతంలో 27,28 తేదీల్లో మహానాడు జరుగనుంది. మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనతో మహానాడు నిర్వహణకు టీడీపీ ఒంగోలు లోని మినీ స్టేడియం ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది.

అయితే చివరి నిముషం వరకు నాన్చి…స్టేడియం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది.  దీంతో టీడీపీ మొదట తాము పరిశీలించిన మండువారిపాలెం గ్రామ సమీపంలోని బృందావన్ ఫంక్షన్ హాల్ ప్రాంతంలోనే మహానాడు నిర్వహించాలని  నిర్ణయించారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నా….అసవరం అయిన ఫీజులు చెల్లించినా ప్రభుత్వం స్టేడియం ఇవ్వకపోవడంపై టీడీపీ మండి పడింది. స్టేడియం ఎందుకు ఇవ్వరు…ఇదేమన్నా వాళ్ల తాతగారి జాగిరా అంటూ నేతలు మండిపడ్డారు. నూతనత్వంతో, భావజాలం చాటేలా మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నేతలకు సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్ కు టీడీపీ అవసరాన్ని చాటేలా మహానాడు ఉండాలని ఆయన అన్నారు. మహానాడుకు సమయం దగ్గరపడుతున్న కారణంగా పనులు వేగవంతం చెయ్యాలని అధినేత సూచించారు. బుధవారం నాడు మహానాడు ప్రాంగణంలో పనులు ప్రారంభించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అయితే జనసమీకరణ కూడా భారీగా చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. సుమారు లక్ష మంది తరలివచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారు. వచ్చిన వారందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *