15 ఏళ్ల క్రితం నాటి పాత కేసులో శిల్పా శెట్టికి భారీ ఊరట.. అసలు ఏం జరిగిందంటే!

Shilpa Shetty: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి, మోడల్ శిల్పా శెట్టి గురించి అందరికీ పరిచయమే. ఈమె ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది. ఇదిలా ఉంటే గతంలో ఈమె పై వేసిన కేసు తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇంతకు అసలేం జరిగిందంటే.. 2007 ఏప్రిల్ 15 న రాజస్థాన్ ప్రజలకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు నటి శిల్పాశెట్టి తో పాటు హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ పాల్గొన్నారు.

ఆ సమయంలో రిచర్డ్ గేర్ బహిరంగంగా శిల్పాశెట్టిని కౌగిలించుకొని ముద్దుపెట్టుకున్నాడు. ఈ సంఘటన వీరిద్దరి మధ్య తీవ్ర పరిణామానికి దారితీసింది. ఈ సంఘటనపై పలు నగరాలలోని పౌరులు పెద్ద సంఖ్యలో నిరసనలు తెలిపారు. ఇక ఆ సమయంలో రాజస్థాన్ లోని ఒక న్యాయస్థానం శిల్పా, గేర్‌ అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. తరువాత న్యాయస్థానం అరెస్ట్ వారెంట్లను సస్పెండ్ చేసింది.

రాజస్థాన్‌లోని కోర్టులో శిల్పా శెట్టి, రిచర్డ్‌గేర్‌లపై ఐపీసీ సెక్షన్లు 292, 293, 294, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని కొన్ని సెక్షన్లు, మహిళల అభ్యంతరకర ప్రవర్తన చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే రాజస్థాన్‌ కోర్టులోని కేసు ముంబైకి మార్చమని శిల్పాశెట్టి పిటిషన్ పెడితే 2017 లో ఆమె పిటిషన్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా ఈ కేసును విచారించి ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేతకి చవాన్ ఒక నిర్ణయానికి వచ్చారు.

ఆనాడు సంఘటన జరిగిన కొద్ది సేపటికే శిల్పాశెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని ఆమెపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవంటూ కేసు కొట్టేశారు. అంతేకాకుండా ఆమెపై ఐపీసీ సెక్షన్ 34 కింద కేసు పెట్టడానికి అవసరమైన చర్యలు లేవని మేజిస్ట్రేట్ కేతకి చవాన్ స్పష్టం చేశారు. దీంతో ఈ కేసును కొట్టేస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో శిల్పా శెట్టికి పాత కేసు నుంచి ఊరట లభించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *