అసెంబ్లీ జగన్ రెడ్డి జాగీరా.?  టీడీపీ  

ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యపట్ల జగన్ రెడ్డి సర్కారు అనుసరించిన విధానం అత్యంత దుర్మార్గమని నక్కా ఆనందబాబు అన్నారు. ‘‘రాజకీయ కురువృద్ధుడిగా పేరొందిన వ్యక్తి మరణిస్తే.. ముఖ్యమంత్రిగా కనీసం సంతాపం తెలపకపోవడం జగన్ రెడ్డి కుసంస్కారానికి నిదర్శనం. తండ్రి శవం దొరక్క ముందే.. ముఖ్యమంత్రి పదవి కోసం చేసిన కుతంత్రాలకు తలొగ్గలేదనే అక్కసుతోనే అవమానిస్తున్నాడు.  కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఒక జిల్లాకు కొణిజేటి రోశయ్య పేరు పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా.. ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడం మీ అహంకారానికి నిదర్శనం.

ప్రతిపక్షాలపై బురద జల్లడానికి, వ్యక్తిగత హననానికి చట్ట సభల సమయాన్ని కేటాయిస్తున్న జగన్ రెడ్డి.. ప్రజానాయకుడి మృతికి సంతాపం తెలిపేందుకు సమయం లేకపోయిందా.? మీ యొక్క అహంకార పూరిత నిర్ణయాలే.. మిమ్మల్ని పాతాళానికి దిగజార్చుతాయని గుర్తుంచుకోవాలి. అసెంబ్లీలో గీతలు గీసి.. ఆ గీతలు దాటితే ప్రతిపక్షాలను సస్పెండ్ చేస్తామంటున్న వైసీపీ నేతల తల రాతలు మార్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని’’ తెలిపారు.

టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండీ రాకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి చనిపోతే.. జగన్ రెడ్డి కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదు. ఈ రోజు అసెంబ్లీలో కనీసం సంతాపం తెలపడానికి కూడా జగన్ రెడ్డికి మనసు రాలేదంటే.. ఆర్యవైశ్యుల పట్ల ఎంత చిన్న చూపో అర్ధమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరొందిన రోశయ్య మరణం పట్ల కూడా ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఆర్యవైశ్యులను అవమానించేలా ఉంది. తెలుగు ప్రజల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా.?‘‘ అని మండిపడ్డారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *