మహిళల్ని రక్షించేందుకు జగన్ గట్టి చర్యలు : వాసిరెడ్డి పద్మ

మహిళలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘సబల ఆమెకు అండగా ఆంధ్ర ప్రదేశ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘మహిళలపై లైంగిక వేధింపులు, హింస’అంశంపై ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, విద్యార్థినిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళలపై, పాఠశాలలు, కళాశాలలలోని విద్యార్థినీలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి జగన్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు.

ప్రభుత్వ శాఖలు, వివిధ ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉండే మహిళలను బలోపేతం చేయడమే సబల లక్ష్యమని, ఆ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తెలిస్తే వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్‌ 63026 66254 నంబరు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  అన్ని ప్రభుత్వ శాఖల్లో అంతర్గత ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

మహిళలకు సబలపై అవగాహన కల్పించడానికే ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.  వైస్ ఛాన్స్లర్ పీవీజీడి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు నాయకత్వ లక్షణాలు అలవడాలని ముఖ్యమంత్రి జగన్ కోరుకుంటున్నారన్నారని, దిశ యాప్ ను మొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్ బీచ్ రోడ్డు లోని ఏయూ కాన్వకేషన్ సెంటర్ లో ప్రారంభించారని గుర్తు చేశారు. ఏయూ లోని విద్యార్థినిల సంరక్షణ కోసం ‘క్యాంపస్ కాప్’ ఇక్కడ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *