మహిళా ఉద్యోగులకు ఏపీ  ప్రభుత్వం శుభవార్త.

మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 రోజులుగా ఉన్న పిల్లల సంరక్షణ సెలవులను 180 రోజులకు పెంచింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు విడుదల చేశారు. పిల్లలను దత్తత తీసుకునే వారికి కూడా ఈ సెలవులు వర్తిస్తాయని ప్రకటించారు. ఇద్దరు లోపు పిల్లలు ఉన్న వారికే ఇది వర్తిస్తుందని ప్రభుత్వ  ఉత్తర్వుల్లో పేర్కొంది.  మగ ఉద్యోగులకు కూడా  ప్రభుత్వం తీపికబురు అందించింది. 15 రోజులపాటు పితృత్వ సెలవులు కూడా ఇచ్చింది. అయితే, పిల్లలను దత్తత తీసుకున్న ఆరు నెలలలోపు మాత్రమే ఈ సెలవులను వినియోగించుకోవాల్సి ఉంటుంది.

సెలవులు తీసుకున్న కాలానికి వేతనాన్ని కూడా చెల్లిస్తారు. అంతేకాదు, దత్తత తీసుకునే పిల్లల వయసు నెల రోజులలోపు ఉంటే ఈ సెలవులు ఏడాదిపాటు కూడా తీసుకోవచ్చు. ఆరేడు నెలల మధ్య ఉన్నట్టయితే ఆరు నెలలపాటు సెలవులు తీసుకోవచ్చు.  ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే నర్సింగు సిబ్బందికి, ఎముకలు, అవయవాల పరంగా ఇబ్బందులు ఉన్న ఉద్యోగులు, ఉద్యోగినులకు ప్రత్యేక సాధారణ సెలవు ఏడాదికి ఏడు రోజులపాటు వర్తింపజేయనున్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అసాధారణ సెలవులను కూడా మంజూరు చేస్తారు. ఆమయంలో ఇచ్చే పరిహారాన్ని కూడా పెంచి ఇస్తారు.

ఎన్జీవోల్లో మూలవేతనం రూ.35,570కు పరిమితం చేసి ప్రభుత్వ పరిహార కనీస మొత్తాన్ని రూ.11,560గా, గరిష్ఠంగా రూ.17,780గా చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. చివరి గ్రేడు ఉద్యోగికి కనీసం రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లించనున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. దీంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *