హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యగా వస్తున్న ఆర్.నారాయణమూర్తి

ఆర్.నారాయణమూర్తి, జయసుధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైంది. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. చదలవాడ పద్మావతి నిర్మాత. పూజాకార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు క్లాప్ నివ్వగా, ఫిల్మ్‌సిటీ ఎండీ రామ్మోహన్‌రావు కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ నేను ఏ సినిమా చేసినా పోలీసు తమ్ముళ్లు నా దగ్గరకొచ్చి అన్నా మా వేషం వేయొచ్చుకదా అని అడిగేవారు. తప్పకుండా చేస్తానని గతంలో వారికి మాట ఇచ్చాను. ఈ సినిమాతో నా మాట నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. నాకు సావిత్రిగారంటే చాలా ఇష్టం. ఆ తరువాత జయసుధగారి నటనంటే ఇష్టం. తొలిసారి ఆమెతో కలిసి నటిస్తున్నందుకు ఆనందంగా వుంది అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం రామోజీరావుగారు అర్థక్రాంతి అనే డిబేట్‌ను నిర్వహించారు. అందులో చర్చించిన అంశం నన్ను చాలా కాలం వెంటాడింది. నల్లధనం వల్ల ఎంత నష్టం జరుగుతోంది? మధ్యతరగతి వాళ్లు దీని వల్ల ఎలా నష్టపోతున్నారు? వంటి అంశాల గురించి ఆలోచించి ఈ చిత్ర కథను సిద్ధం చేసుకున్నాను. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేసి జనవరిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. నారాయణమూర్తితో పోటీపడి నటించాలనుకుంటున్నానని జయసుధ తెలిపింది. సునీల్‌శర్మ, జయప్రకాష్‌రెడ్డి, తనికెళ్ల భరణి, చలపతిరావు, వెన్నెల కిషోర్, సమీర్, వై.విజయ, విజయభాస్కర్ తదితరులు నటిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *