ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన మీ దగ్గర మేమేం నేర్చుకోవాలి: ఎమ్మెల్యే అనిల్ ధ్వజం

నగరంలోని 52 వ డివిజన్ ఉడ్ హౌస్ సంఘం ప్రాంతంలో శుక్రవారం నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తో కలిసి ‘గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాంతంలోని ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం దిశగా పోరాడతామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దు ను తన ఘనతగా చెప్పుకుంటున్నారని, తాను లేఖలు వ్రాసిన కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారని మరలాంటి కేంద్రానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగం అయిన ప్రత్యేక హోదా కోసం ఎందుకు లేఖ వ్రాయలేదని ప్రశ్నించారు. స్థానిక టిడిపి నేతలు నారా లోకేష్ ను చూసి యువత ఏదో నేర్చుకోవాలని చెబుతున్నారని, ఏమి నేర్చుకోవాలో చెప్పాలని సెలవిచ్చారు. 2014 ఎన్నికల్లో ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం, నిరుద్యోగ భృతి, 3 సెంట్ల భూమి, పక్కా ఇల్లు, రుణమాఫీ చేస్తాం అంటూ అధికారం లోకి వచ్చారని తీరా ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తున్నారని, ప్రత్యేక హోదాతో అనేక ప్రయోజనాలు కలుగుతూ నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయని మరి నారా లోకేష్ ఏనాడూ ప్రత్యేక హోదా గురించి, యువకుల సమస్యల గురించి మాట్లాడలేదన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన లోకేష్ ను చూసి ఏమి నేర్చుకోవాలని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రవిచంద్ర, ఖలీల్ అహ్మద్, మహేష్, దార్ల వెంకటేశ్వర్లు, పోలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సంక్రాంతి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *