కోర్టు దెబ్బతో పాటను తొలగించిన రామ్ గోపాల్ వర్మ

ఎవరేం అనుకున్నా తను అనుకున్నది చేసుకుంటూ పోయే రాంగోపాల్ వర్మ, వంగవీటి సినిమా విషయంలో వెనక్కి తగ్గక తప్పలేదు. విజయవాడ రౌడీయిజం, రాజకీయాల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా వంగవీటి. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తున్నారు. అంతే కాదు సినిమా మొదలైన సమయంలోనే కమ్మ కాపు అంటూ రిలీజ్ చేసిన సాంగ్ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో విజయవాడ చరిత్రను వక్రీకరించారంటూ కొంత మంది కోర్టును ఆశ్రయించారు. విజయవాడలో ముఖ్యంగా కుల విద్వేశాలను రెచ్చగొట్టేవిధంగా ఉన్న కమ్మ కాపు పాటను సినిమాను నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు చిత్ర దర్శకుడు రాం గోపాల్ వర్మ తో పాటు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వరాదని సెన్సార్ బోర్డ్ ను ఆదేశించింది. డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్న చిత్రయూనిట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వివాదాన్ని మరింత పెంచుకోవటం కరెక్ట్ కాదని భావించి వెనక్కు తగ్గింది. వివాదానికి కారణమైన పాటను సినిమా నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో అనుకున్నట్టుగా రాంగోపాల్ వర్మ వంగవీటి డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ శనివారం ఈ చిత్ర ఆడియోను విజయవాడలోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు వర్మ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *