లెక్కలు చూపకుండా డబ్బులు వేస్తే జైలే గతి
November 21, 2016
లెక్కలు చూపని డబ్బును పలువురు తమ బ్యాంకు ఖాతాలలో ఖాళీ లేక వేరే వారి ఖాతాలను ఆశ్రయిస్తున్నారు. ఈ రకంగా వేరే వారి ఖాతాల్లో వేసే డబ్బు లెక్కల పై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. సాధారణంగా లావాదేవీలు జరపకుండా నోట్ల రద్దు నేపథ్యంలో అకస్మాత్తుగా ఖాతాల్లో చేరిన డబ్బుల వివరాలు, ఏ ఖాతాలో అయినా 2.5 లక్షల రూపాయల డిపాజిట్ లు ఏ దశలో దాటినా ఆ వివరాలన్నింటినీ బ్యాంకు అధికారులు అందజేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే అందుకు సంబంధించిన సర్కులర్ లను బ్యాంకులకు పంపించింది. ఇప్పటికే 80 సర్వేలు, 30 సోదాలు దీనికి సంబంధించి నిర్వహించినట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలియజేసారు. వేరే వారి పాత డబ్బుని తమ అకౌంట్ లో వేసుకుని నూతన కరెన్సీ ని ఇచ్చేలా చూసే ఒప్పందాలను బినామీ లావాదేవీలుగా గుర్తిస్తున్నామని, వీరి పై కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేసి ఆ సొమ్మును స్వాధీనపరుచుకోనున్నట్లు స్పష్టం చేసారు. ఇలా బినామీ లావాదేవీలు నడిపిన ఇరువురికి ఏడేళ్ళ వరకు జైలు శిక్ష పడుతుందని ఓ అధికారి తెలియజేసారు.