ఎన్నికల మూడ్ లోకి వైసీపీ..అందుకే గడపగడపకు..?
ఏపీలో రాజకీయ వేడి మొదలవుతోంది. పార్టీల పంథాలు చూస్తే సమరానికి సై అంటున్నాయనే అనుకోవాలి. కౌలు రైతుల ఆత్మహత్యలను అజెండాగా తీసుకుని, ఒక్కొక్కరికి లక్ష పరిహారం చొప్పున జనసేన క్షేత్ర స్థాయిలోకి దిగింది. పెంచిన పన్నులు, పెరిగిన ధరలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ బాదుడే బాదుడే పేరుతో ప్రజల్లో తిరుగుతోంది. అంతేకాదు టీడీపీ-జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేస్తాయన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ అప్పమత్తమైంది. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా తమ ఓటు బ్యాంకును నిలబెట్టుకుని, మళ్లీ అధికారంలోకి వైసీపీ గట్టిగానే స్కెచ్ వేస్తోంది. జనంలోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందుకోసం ‘‘గడపగడపకూ మన ప్రభుత్వం’’ అని పిలుపునిచ్చింది. మొదట గడపగడపకూ వైసీపీ అని అని తర్వాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారు.
ఈ మేరకు జీవో కూడా విడుదల చేశారు. ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్ లు, మంత్రలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను గురించి, ఒక్కో ఇంటికి ఎంతమేర లబ్ధి చేకూరిందన్న చెప్పాలని చూస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. మంగళవారం కోనసీమ జిల్లాలోని మురమల్లలో గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా తుఫాన్ కారణంగా వాయిదా వేశారు. దీనికి మరోమారు షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. అయితే గడపగడపకు వెళ్లి ఏం ప్రజలకు ఏం చెప్దామని అటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ నాయకులు తర్జనబర్జన పడుతున్నారు.
అభివృద్ధి ఏం మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లాలని బాహాటంగానే ప్రశ్నించుకుంటున్నారు. మూడేళ్లలో వైసీపీ ప్రజల వద్దకు వెళ్లలేదు. వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఎవరికీ తెలీదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏ రూపంలో బయటకొస్తుందోనని వైసీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మూడేళ్ల తర్వాత వ్యతిరేకత రావడం సహజమేనని మంత్రి రోజా అనడం చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది మంత్రులకు కూడా తెలుస్తోంది. గడపగడపకు కార్యక్రమం ద్వారా వైసీపీ నేతల్ని ప్రజలు ఆదరిస్తారా..వ్యతిరేకిస్తారా అన్నది మరి కొన్ని రోజుల పాటు చూడాల్సిందే..!