ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు

మోటార్లకు మీటర్లు పెడితే రైతులు ఉరి వేసుకోవాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కుప్పలంలో మూడు రోజులు పర్యటన చేయనున్నారు. మొదటి రోజున కుప్పం సరిహద్దు ప్రాంతం బెలకోగలలో చంద్రబాబు పర్యటించారు. బెలకోగలలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. గాలివానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించారు. ఇంటింటికీ నడుచుకుంటూ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ..  ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దొంగల రాజ్యం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు.

రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్రీకేర్ ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రుణాలు రాకుండా చేస్తున్నారని, రైతుల మోటార్లకు మీటర్లు వేస్తే రైతు ఉరేసుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అరాచకానికి తెరలేపారని, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇలాంటి సీఎంను చూడలేదు అన్నారు. పంపుసెట్లకు మోటార్లు బిగిస్తే సాధారణ రైతు పరిస్థితి అగమ్యచోచరమే అని తెలిపారు. ప్రజలకోసం తాను కేసులు పెట్టించుకోవడంలో వెనకడుగు వేయనని స్పష్టం చేశారు.

ఈ రాష్ట్రం మరో శ్రీలంక కావడానికి ఎంతో సమయం పట్టదని ఆరోపించారు. ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఆదాయాన్ని మింగిస్తున్నారని, వైసీపీ నేతల దోపిడీలకు అడ్డులేకుండా పోయిందన్నారు. లిక్కర్, గనులు, మైనింగ్ ద్వారా అడ్డగోలుగా దోచేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. కుప్పం ప్రజల అభిమానాన్ని, ఆదరణను ఎప్పటి మర్చిపోనని పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి కూడా కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *