తన రియల్ లైఫ్ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పిన విశ్వక్ సేన్
‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్నామా దాస్’, ‘పాగల్’ చిత్రాలతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్. కూల్, క్లాస్ లుక్లో ఆయన నటించిన కుటుంబ కథా చిత్రం ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’. విద్యాసాగర్ చింతా దర్శకుడు. పెళ్లి కోసం ఎదురుచూసే ఓ 30 ఏళ్ల వ్యక్తి ఎదుర్కొనే ఇబ్బందులను ఈ సినిమాలో ఎంతో సరదాగా చూపించారు. వేసవి కానుకగా మే 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలతో విశ్వక్ సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం ఉదయం విడుదల చేసింది.
ఆ వీడియోలో విశ్వక్ సేన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇదే సమయంలో తన బ్రేకప్ స్టోరీను వెల్లడించారు. ప్రతి ఒక్కరి లైఫ్లో బ్రేకప్ ఉంటుందని.. దాన్ని ఎవరూ తప్పించుకోలేదని.. తన లైఫ్లో కూడా ఒక బ్రేకప్ ఉందని అన్నారు. అంతకుమించి ఎక్కువ బ్రేకప్స్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఓ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించినట్లు చెప్పారు విశ్వక్ సేన్. కాలేజ్ లో మూడేళ్లపాటు చూశానని.. కానీ ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. కాలేజ్ అయిన తరువాత ఓ ఫ్రెండ్ పార్టీలో కలిశామని.. అప్పటినుంచి క్లోజ్ అయ్యామని చెప్పారు. కానీ వారి జర్నీలో ఆ అమ్మాయి ఎప్పుడో బ్రేకప్ చెప్పేసింది.. ఆ విషయం తనకు ముప్పై రోజుల తరువాత అర్థమైందని తెలిపారు.
ఇక ఇప్పటికీ తనని మరిపోలేదని, బ్రేకప్ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధగా ఉంటుందని విశ్వక్ ఎమోషనల్ అయ్యాడు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా బ్రేకప్ సీన్స్ ఉంటాయని, బ్రేకప్ అయినప్పుడు ఏడుపు పాటలు కాకుండ కాస్తా జోష్ ఉన్న సాంగ్స్ పెట్టమని తనే దర్శకులకు చెబుతానన్నాడు. అందుకే తన సినిమాల్లో బ్రేకప్ పాటలు కూడా ఫుల్ జోష్గా ఉంటాయని తెలిపాడు.