మా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం ఇదే తొలిసారి : సజ్జల

విద్యుత్‌ ఛార్జీలు కొన్ని తరగతులకు స్వల్పంగా పెంచుతూ, దాదాపు రూ.1400 కోట్ల భారాన్ని ఈఆర్‌సీ అనుమతి ఇచ్చిన మేరకు పెంచడం జరిగిందని, అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచలేదని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలు చెల్లిస్తున్నామని, కానీ ఇప్పుడు పెరిగిన వ్యయం వల్ల అనివార్యంగా స్వల్పంగా ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు. అది కూడా ఎక్కువ విద్యుత్‌ వినియోగించే వారిపైనే భారం వేసే విధంగా టారిఫ్‌ నిర్ణయించామన్నారు.

సహజంగానే టీడీపీ విష ప్రచారం చేస్తోందని, సాధారణంగా ఏ ప్రభుత్వం కూడా ప్రజలపై భారం వేసి, ఆ ఆదాయంతో ఏదో చేయాలని అనుకోదన్నారు. జగన్‌నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తారని, వారి మేలు కోసమే పని చేస్తారన్నారు. నిజం చెప్పాలంటే ఆనాడు టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా పీపీఏలు చేసుకున్నారని, ఒకవైపు అప్పులు, మరోవైపు బకాయిలూ పెంచి, అడ్డగోలుగా విద్యుత్‌ సంస్థలను నడిపారని పేర్కొన్నారు. ఇప్పుడు టీడీపీ ఆందోళన చేస్తూ, ఉద్యమానికి సిద్ధమవుతోందని, మరోవైపు వామపక్షాలు, బీజేపీ కూడా దానికి మద్దతు పలుకుతున్నాయని మండిపడ్డారు.

తమ హయాంలో 2014–19 మధ్య విద్యుత్‌ ఛార్జీలు పెంచేది లేదని ప్రకటించామని, నిరంతర విద్యుత్‌ సరఫరా చేశామని తనంతట తాను చంద్రబాబు చెప్పుకుంటున్నారని, తనది సుపరిపాలన అంటూ, విద్యుత్‌ కూడా అదనంగా ఉత్పత్తి చేశామని చెప్పారన్నారు. ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ, ఈ మూడేళ్లలో ప్రజలపై రూ.42,172 కోట్ల విద్యుత్‌ భారం మోపామని అంటున్నారని, దానికి ఏదైనా ఆధారం ఉందా? అనిప్రశ్నించారు.  ఈ ప్రభుత్వం ఎక్కడ అంత భారం మోపిందని, నిజానికి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదన్నారు. ఇవాళే తొలిసారిగా ఛార్జీలు పెంచిందన్నారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *