ఈ ప్రభుత్వం టీచర్లను కూలీలుగా మార్చింది : టీడీపీ ఎమ్మెల్యే డోలా

విద్యా వ్యవస్థను జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, జిల్లాకు 397 పోస్టుల చొప్పున 12 జిల్లాల నుంచి 4,764 సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ) పోస్టులను  రద్దు చేస్తూ జీవో నెం. 37ను మార్చి 24, 2022న జారీ చేసిందని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.  ‘‘ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న 3,260 పోస్టులకు సర్వీసు నిబంధనల కోసం వీటిని విలీనం చేస్తున్నట్లు చెప్పడం విద్యార్దులకు తీరని ద్రోహం చేసినట్లే. 2013లో ఆంగ్ల మాధ్యమంతో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశారు.

వీటికి 163 మంది ప్రిన్సిపాళ్లు, 1956 మంది పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), 1,141 మంది ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ల (టీజీటీ) పోస్టులను మంజూరు చేసింది.  వీటిలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇప్పటిదాకా సర్వీసు నిబంధనలు లేవు. దీంతో పీఎఫ్‌, ఆరోగ్యకార్డుల వంటి సదుపాయాలు లభించడం లేదు.  విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను రోడ్డు పాలన చేస్తుంది. మొన్న మద్యం అమ్మించారు, నిన్న రోడ్డు ఎక్కించారు, నేడు పోస్టులు రద్దు చేసి పొట్టుకొట్టారు.

నాడు నేడు పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడికి గురి చేసి బలికొన్నారు. కరోనాతో చనిపోయిన ఉపాధ్యాయులను ఆదుకున్న పాపాన పోలేదు. కరోనా సమయంలో దాదాపు 5 లక్షల మంది ప్రైవేట్ టీచర్లను కూలీల మార్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది.  ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పీజీ విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ను రద్దు చేశారు. జగన్ రెడ్డి బుద్ది తెచ్చుకొని విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేయాలి గాని ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలకు యువత తగిన సమయంలో నీకు బుద్ధి చెబుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *