ఆసరా పథకం అంటే ఏంటని అడిగిన మంత్రి
ఆయన స్వయానా ఓ పెద్ద శాఖకు మంత్రి. తను విసిరే చలోక్తులు, సెటైర్లు ప్రత్యర్థులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అసెంబ్లీలో సైతం ఆయన ప్రసంగాన్ని ఎంతో ఆసక్తిగా వింటారు ప్రత్యర్థులు సైతం. అలాంటి ఆయన ఇటీవల కాలం నుండి అబాసుపాలవుతున్నారు. తన శాఖపై సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడం, ప్రభుత్వ పథకాలపైనా కనీస అవగాహన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ ఎవరా మంత్రి..ఏ పథకం గురించి ప్రశ్నించారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి వర్గ పునర్యవస్థీకరణలో నీటిపారుదల శాఖా మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు శ్వీకరించారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది.
కానీ బుధవారం ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధుడికి పథకాలు వస్తున్నాయా అని అడిగాడు. ఆసరా వస్తుందా…అని అడిగి..ఆసరా అంటే ఏంటి అని పక్కనున్న సచివాలయ ఉద్యోగులను అడిగారు. వారు డ్వాక్రా అని చెప్పడంతో హా..డ్వాక్రా డబ్బులు వస్తున్నాయా అని మళ్లీ వృద్ధుడును అడిగాడు. దానికి ఆయన మొదట రావడం లేదని సమాధానం ఇవ్వగా రెండో సారి వస్తున్నాయని చెప్పాడు.
ఈ సంభాషణ సమయంలో జనంతో మాట్లాడేటప్పుడు తీసే వీడియోల మాదిరి ఈ వీడియోను కూడా తీశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్న గోదావరి నదిమీద పులిచింతలు ఉందని, కాదు కాదు కృష్ణానదిపై ఉందని నాలుక కరుచుకున్నారు. నీటిపారుదల శాఖా మంత్రిగా ఉండి ఏ నదిపై ఏ ప్రాజెక్టు ఉందో తెలియకపోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది. తాజాగా ఆసరా అంటే ఏంటని అడిగిన మాటలు కూడా ప్రస్తుతం విమర్శలకు గురవుతున్నాయి.