పదవుల పంపకాల్లో వైసీపీలో రేగుతున్న చిచ్చు..!

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో వైసీపీలో అగ్గి రేగుతోంది. సీనియర్లను పక్కనబెట్టి కొత్తగా ఎన్నికైన వారికి పదవులు ఇవ్వడంతో వైసీపీ నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పార్టీని అంటిపెట్టుకుని ఉంటే కనీసం పదవుల ఎంపికలో తమ పేర్లు కూడా పరిశీలనలో లేవని బాధపడుతున్నారు. మరి కొన్ని చోట్ల పాత వారిని కొనసాగించడంపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వడంతో ఆశలు పెట్టుకున్న రోజా, భూమన కరుణాకర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. చెవిరెడ్డికి తుడా చైర్మన్ పదవీకాలం పొడిగించడంతో శాంతించారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసురెడ్డి, సురేష్ ఇది వరకు ఉన్నారు. వీరిలో సురేష్ ను కొనసాగిస్తూ..బాలినేని పక్కనపెట్టడంతో ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. అంతే కాదు ఇక ముందు సురేష్ ను టార్గెట్ చేస్తారన్న అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. పల్నాడులో నాలుగుసార్లు ఎన్నికైన సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పదవి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు రాజీనామాలకు సిద్ధమయ్యారు.  విడదల రజనీకి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ మర్రి రాజశేఖర్ వర్గీయులు చిలకలూరిపేటలో ఆందోళనకు దిగారు.

నెల్లూరులో పార్టీని అంటిపెట్టుకున్న తనకు కాదని కాకాణి గోవర్థన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో కోటంరెడ్డి శ్రీధర్ అలకబూనారు. పదవులిస్తామని చంద్రబాబు పిలిచినా తాను టీడీపీలోకి వెళ్లలేదని, కనీసం పేర్ల పరిశీలనలో కూడా తన పేరు లేదని శ్రీధర్ రెడ్డి అనుచరుల వద్ద మొరపెట్టుకున్నారని సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణ సీఎం జగన్ నిర్ణయమని, సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని బొత్స అన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ కొత్త కేబినెట్ తయారైందన్నారు. కొత్తగా మంత్రి పదవులు వరించే వారి నివాసాల వద్ద పండగ వాతావరణం నెలకొంది. సాయంత్రం 7 గంటలకు లిస్టు గవర్నర్ వద్దకు చేరనుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *