విద్యార్థులకు స్పెషల్ ట్యూషన్లు : మంత్రి నాగార్జున

ఎస్సీ హాస్టళ్లలో చదివే 9వ తరగతి విద్యార్థులకు రెండు నెలల ముందు నుంచే 10వ తరగతి కి సంబంధించిన పాఠ్యాంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షలలో అతి తక్కువ శాతం ఫలితాలు వచ్చిన చోట ప్రిన్సిపాల్స్ పై చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు.  ఎస్సీ హాస్టళ్లలో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలలో 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులైన నేపథ్యంలో సాంఘిక సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం తన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, ఎస్సీ హాస్టళ్లలో వచ్చిన పదవ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసారు.

ఎస్సీ హాస్టళ్లలో రాష్ట్రస్థాయిలో 49 శాతం ఫలితాలు వచ్చినా కొన్ని జిల్లాల్లో ఫలితాల శాతం మరీ తక్కువగా ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేసారు. అతి తక్కువ ఫలితాలు వచ్చిన చోట ప్రిన్సిపాల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు అందర్నీ మళ్లీ హాస్టళ్లకు పిలిచి వారిని అక్కడే పెట్టుకొని, సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణులు కావడానికి అవసరమైన స్పెషల్ ట్యూషన్లు పెట్టించాలని, ప్రతి విద్యార్థి కూడా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా చూసుకోవాలని కోరారు.

అలాగే 9 తరగతికి చెందిన విద్యార్థులు పదవ తరగతికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా రెండు నెలల ముందుగానే వారికి పదో తరగతికి చెందిన పాఠ్యాంశాలపై అవగాహన కల్గించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. అయితే ఫలితాలు మెరుగుపడకపోతే మాత్రం తాను సహించేది లేదని నాగార్జున హెచ్చరించారు. ఎస్సీ హాస్టళ్లలో ఫలితాలను మెరుగుపర్చడానికి తీసుకోనున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *