ముంబైలో ఆటో నడుపుతున్న మాజీ బిగ్ బాస్ విన్నర్… రాహుల్
బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్. అయితే ఇప్పుడు తాజాగా ముంబై వీధుల్లో ఆటో నడిపి అందరికీ షాక్ ఇచ్చాడు ఈ సింగర్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది తన జీవితంలో లంబోర్ఘిని అని, దీని వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానంటూ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలె ముంబైలో జరిగింది.
ఈ సందర్భంగా రాహుల్ ముంబై వెళ్లాడు. దాంతో అక్కడ సరదాగా ఇలా ఆటో నడిపినట్లు తెలుస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఎంతగానో పాపులర్ అయిన నాటు నాటు సాంగ్‌ని రాహుల్ పాడిన సంగతి తెలిసిందే. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో కొమురమ్ భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రలు పోషించారు.
ఇక ఈ సినిమాలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ క్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. మెగా, నందమూరి ఫ్యామిలీ లకు చెందిన ఇద్దరు అగ్ర నటులు ఈ సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా చేస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా మూవీ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.