చిల్లర వ్యక్తులు..చిల్లర రాజకీయాలంటూ తుమ్మల ఫైర్..!

మాజీమంత్రి, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదికూడా వేరే పార్టీపై కాదు..సొంత పార్టీకి చెందిన నేతలపైనే. ఇటీవల జైలు నుంచి విడుదలైన తన అనుచరుడు, మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్‌ని తుమ్మల పరామర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ కక్షలకు పోలేదన్నారు. జిల్లా అభివృద్ధి కోసం పలు ప్రాజెక్టులు తీసుకొచ్చామని, కానీ ఇప్పుడు ఒకేపార్టీలో ఉన్నప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చిల్లర వ్యక్తులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీమంత్రి తుమ్మల ఫైర్‌ అయ్యారు. అలాంటి వ్యక్తులు కవ్వించినా సంయమనం పాటించాలని అనుచరులకు సూచించారు.

రెచ్చగొట్టే వాళ్ల సంగతి పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, రాజకీయాల్లో ఓపిక అవసరమని చెప్పారు. అయితే టీఆర్ఎస్ లో ఇప్పుడిప్పుడే లుకలుకలు బయటకొస్తున్నాయి. పార్టీ స్థాపన నుండి వచ్చిన నేతలు,  అధికారం వచ్చిన తర్వాత చేరిన నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు.  ఇక ఖమ్మంలో అసంతృప్తులు ఒకటెంట ఒకటి బయటపడుతున్నాయి. తుమ్మల అనుచరుడు, మాజీ కార్పొరేటర్ భాస్కర్ అరెస్టుతో వివాదం మరింత రేగింది. అక్రమ కేసులు పెట్టించి మరీ అనుచరుడిని జైలుకి పంపించారని తుమ్మల వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మొన్నటి వరకు ​ కందాల ఉపేందర్​ రెడ్డితో తుమ్మలకు విభేధాలు ఉన్నాయి. కొత్తగూడెం జిల్లాలోనూ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్సెస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పొంగులేటి తన నియోజకవర్గంలో వేలుపెడుతున్నారని కాంతారావు ఇది వరకే బహిరంగంగా చెప్పారు. ఇక జిల్లాలో వైరాలో రాములు నాయక్​ వర్సెస్​ మదన్​లాల్, ఇల్లందులో హరిప్రియ వర్సెస్​ కోరం కనకయ్య, కొత్తగూడెంలో వనమా వేంకటేశ్వరరావు వర్సెస్​ జలగం వెంకట్రావుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. దీంతో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *