రాణా ‘విరాటపర్వం’ విడుదల తేదీ ప్రకటన..!

యంగ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా, అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘విరాట పర్వం’. ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను అనేకసార్లు వాయిదా వేశారు. ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకు సైలెంట్‌గానే ఉంది. దీంతో విరాటపర్వం చిత్రం అసలు రిలీజ్ అవుతుందా అనే సందేహం అందరిలో నెలకొంది. కానీ అందరి ఊహలను తారుమారు చేస్తూ, విరాటపర్వం ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో ఓ అప్‌డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

rana daggubatis Virataparvam movie release date announced

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘విరాట పర్వం’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జులై 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం.. మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్భం.. ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం’ అంటూ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను పంచుకున్నారు.

పోరాట నేపథ్యానికి సంబంధించిన ఈ లుక్‌లో రానా ఓ చేత్తో తుపాకీని, మరో చేత్తో సాయి పల్లవిని పట్టుకుని కనిపించాడు. తెలంగాణలో 90లనాటి నక్సలైట్‌ ఉద్యమాల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంలో ప్రియమణి, నవీన్‌ చంద్ర, నందితా దాస్‌, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్ బాబు సమర్పిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *