గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తా : సీఎం జగన్
జులై 8లోగా జిల్లా కమిటీల ఏర్పాటు చేసి, కమిటీల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చోటు కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. యుద్ధం చంద్రబాబుతోనే కాదు.. ఎల్లోమీడియాతో అన్నారు. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. బుధవారం రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘గడపగడపకూ పూర్తయ్యే సరికి ప్రతి గ్రామంలో సోషల్‍మీడియా వారియర్స్ .సచివాలయాల విధులకు సంబంధించి ఎమ్మెల్యేలు సలహాలు ఇవ్వాలి. నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లను ప్రారంభించాలి. కలిసికట్టుగా పనిచేయాలి, ఎలాంటి విభేదాలున్నా పక్కనబెట్టాలి. మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం.
జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా కేబినెట్ హోదాలో జిల్లా అధ్యక్షులు, మే నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నాం, అందరూ సన్నద్ధం కావాలి. 151 సీట్లు గెలిచాం, దీనికి తగ్గకుండా మళ్లీ మనం గెలవాలి. కుప్పంలో మున్సిపార్టీ గెలిచాం, స్థానిక సంస్థల్లో గెలిచాం. కుప్పంలో స్థానిక సంస్థలు గెలిచినపుడు ఎమ్మెల్యేగా కూడా గెలుస్తాం. ఇంత మంచి చేస్తున్నపుడు ప్రజలే గొప్ప గెలుపును అందిస్తారు. మనం ఒదిగి ఉండి.. ప్రజలకు చేసిన మంచిని చెప్పాలి. సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా నా గ్రాఫ్ 65 శాతం ఉంది.
ఎమ్మెల్యేల్లో చాలామందికి 40 నుంచి 45 శాతమే గ్రాఫ్ ఉంది. ఎన్నికల నాటికి మీ గ్రాఫ్ పెరగకపోతే మార్పులు తప్పవు. మన సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనపెడతా. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను మంత్రులు కలుపుకొని వెళ్లాలి. ఎవరికైనా పార్టీనే సుప్రీం.. గెలిస్తేనే మంత్రి పదవి. గెలిచేందుకు నిధులు సమకూరుస్తా. ఎవ్వరూ తాము ప్రత్యేకం అనుకోడానికి వీల్లేదు. 175కి 175 సీట్లు ఎందుకు గెలవబోము’’ తెలిపారు.