వివేకా హత్యపై సీబీఐ ఛార్జ్ షీట్.. అనుమానం ఎవరిపైనంటే.?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని జగన్ సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో హత్య చేయించారన్న అనుమానం ఉనట్లు సీబీఐ నిర్ధారించింది. గతంలో పులివెందుల కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లోని అంశాలు సోమవారం వెలుగుచూశాయి. కడప లోక్‌సభ నియోజకవర్గం స్థానంలో పోటీ చేసేందుకు అవినాష్‌రెడ్డికి కాకుండా షర్మిల, విజయమ్మ, తనలో ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని వివేకానందరెడ్డి జగన్ ను కోరారు. కడప నుండి పోటీ చేయాలనుకున్న అవినాష్‌రెడ్డే ఆయన్ను హత్య చేయించారని ఛార్జ్ షీట్లో సీబీఐ వివరించింది. ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరిల ప్రమేయంపైనా అభియోగపత్రాలు బయటపడ్డాయి.
ఫిబ్రవరి 10నే వివేకా హత్యకు ప్రణాళిక సిద్ధమైంది. ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో జరిగిన ఈ కుట్రలో దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి భాగస్వాములయ్యారు. వేకాను హత్య చేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో నీకు రూ.5 కోట్లు ఇస్తాం. ఈ హత్య చేస్తే నీ జీవితం సెటిల్ అయిపోతుంది. వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి వంటి పెద్దలు ఈ హత్య ప్రణాళికలో ఉన్నారు’ అని ఎర్ర గంగిరెడ్డి దస్తగిరితో చెప్పారు.
వివేకా మృతి వార్త వెలుగుచూసిన తర్వాత 2019 మార్చి 15న ఉదయం 6.25 గంటలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఇతర సన్నిహితులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డికి కూడా అక్కడికి చేరారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో ఉన్నా.. ఆయన గుండెపోటుతో మరణించారంటూ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు ప్రచారం మొదలుపెట్టారు. ఇదే మాటను శివశంకర్‌రెడ్డి.. సాక్షి టీవీకి తొలిసారి చెప్పారు. వివేకా కుమార్తె, అల్లుడు రాకుండానే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు.
వివేకా తల, నుదురు, అరచేతిపై గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. హెమరేజిక్ షాక్‌తో పాటు, మెదడుకు తీవ్ర గాయాలవటం వల్ల చనిపోయారని నివేదికలో వెల్లడైంది. గొడ్డలితో వివేకాను హత్య చేసి ఉండొచ్చని శవపరీక్ష చేసిన వైద్యులు వెల్లడించారు. అయితే చివరకు ఈ ఉచ్చు అవినాష్ రెడ్డికే బిగుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. చివరకు ఏం జరగుతుందో చూడాలి.