మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు

అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళన దిగింది. కోనసీమ జిల్లా ముద్దు .. వేరే పేరు వద్దు అంటూ వందలాది యువకుల నినాదాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. ఆందోళనకారులను పోలీసులు వెంబడించి, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని పరుగులు తీశారు.  దీంతో అమలాపురంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. ఇక ఆందోళన అదుపుతప్పడంతో పోలీసులపై నిరసనకారులు రాళ్ల వర్షం కురిపించారు. సుమారు 20 మందికిపైగా పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్పీ గన్‍మెన్, ఎస్సై, సీఐలకు తీవ్రగాయాలుకాగా, అమలాపురం డీఎస్పీ సొమ్మసిల్లి పడిపోయారు.

ఆందోళనకారులను తరలిస్తున్న రెండు ప్రైవేట్ బస్సులను నిరసనకారులు తగలబెట్టారు. కలెక్టర్ కార్యాలయం రోడ్లన్నీ దిగ్భంధనం చేసినా పోలీసుల వలయాన్ని చేధించుకొని కలెక్టరేట్‍కు వెళ్లారు. మంత్రి విశ్వరూప్‍కు చెందిన రెండు నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మొదట నిప్పు పెట్టిన ఇళ్లు పూర్తిగా దగ్ధమవ్వగా, నిర్మిస్తున్న ఇంటిపైనా దాడి చేసి, నిప్పంటించారు. మంత్రి విశ్వరూప్ క్యాంప్ కార్యాలయాన్ని కూడా తగలబెట్టారు. అమలాపురంలోని అధికార పార్టీ నేతల ఇళ్లను పోలీసులు ఖాలీ చేయించారు. హింస వెనక టీడీపీ, జనసేనల ప్రమేయం వుందని వైసీపీ ఆరోపిస్తోంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే అన్ని పార్టీలూ స్వాగతించాయని, ఇప్పుడు యువతను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టిస్తున్నారని విమర్శించింది.

చేతులు జోడించి వేడుకుంటున్నానని, ఆందోళన ఆపాలని మంత్రి విశ్వరూప్ కోరారు. కోనసీమ ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ కోరారు. అంబేద్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువు చేయడం దురదృష్టకరమని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆందోళన చేసింది అమలాపురం స్థానికులేనని, ఒకేసారి మూకగా వచ్చి దాడి చేశారని, 300 మంది పోలీసులతో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *