రామతీర్థం వివాదంలో అశోక్ గజపతిపై కేసు నమోదు
విజయనగరం రామతీర్థంలో చోటుచేసుకున్న వివాదంలో విజయనగరం తెదేపా సీనియర్ నేత అశోఖ్ గజపతి రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీసు స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. రామతీర్థంలో ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంతో పాటు, తమ విధులకు కూడా ఆటంకం కలిగించారంటూ.. అశోక్ గజపతి రాజుపై ఈవో ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సెక్షన్473, 353 కింద అశోక్ గజపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే…
విజయనగరం బోడికొండపై బుధవారం రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం సమయంలో ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే తనను కొబ్బరికాయ కొట్టనీయకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్ గజపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు నేతలు, కార్యకర్తల మధ్య ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే శిలా ఫలకం బోర్డును కూడా తొలగించే ప్రయత్నం చేశారు. కానీ, ఎట్టకేలకు పోలీసుల చొరవతో పరిస్థితిని అదుపు చేసి.. శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై తెదేపా నేత చంద్రబాబు సహా, పలువురు నేతలు స్పందించారు.
మంత్రులు అశోక్ గజపతిరాజుపైకి రౌడీల్లా వెళ్లారని చంద్రబాబు అన్నారు. ఉన్నత స్థానాల్లో ఉంటూ.. అలా ఎలా ప్రవర్తించారంటూ ప్రశ్నించారు. ఆలయ ధర్మకర్తగా ఉన్న గజపతిని ఎలా అడ్డుకుంటాంరని మండిపడ్డారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.