జగన్ దెబ్బకు సొంతపార్టీ వారే బలవుతున్నారు : నారా లోకేష్
జగన్ రెడ్డి పోలీస్ రాజ్ దెబ్బకు ఇప్పుడు సొంతపార్టీ వారే బలవుతున్నారని, ప్రతిపక్షం, ప్రజల్ని తప్పుడుకేసులు, అరెస్టులతో వేధించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా తనను ఎదిరిస్తున్న, తన పార్టీవారిపైనే పగబట్టాడని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ అన్నారు. తప్పుడు కేసులతో జగన్ రెడ్డి టీడీపీని అడ్డుకోలేడని, టిడిపికి చెందిన 55 మంది నేతలు, 4 వేల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. విజయవాడలో ఓ కేసు నిమిత్తం కోర్టుకు హాజరైన లోకేష్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్‌కి దమ్ము, ధైర్యం ఉంటే 2014నుంచి నాపై చేసిన తప్పుడు ఆరోపణలు, వైసీపీ ప్రభుత్వం నాపై పెట్టిన తప్పుడుకేసులపై నాతో బహిరంగచర్చకు రావాలని సవాల్ చేస్తున్నా.
ఎన్ని తప్పుడుకేసులు పెట్టినా నేనుగానీ, మా పార్టీవారుగానీ భయపడరు. మేము తప్పుచేయలేదు, ధైర్యవంతులం కాబట్టే, కోర్టులకు హాజరై సమాధానం చెబుతున్నాం. దేశాన్ని దొబ్బి జగన్ రెడ్డిలా కుంటిసాకులు చెబుతూ, తప్పించుకొని తిరగడంలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి టీడీపీ రూ.6 లక్షలకోట్ల అవినీతి చేసిందన్నాడు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా జగన్‌రెడ్డి ఏం పీకాడు? డ్రైవర్ ను చంపిన సొంతపార్టీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయించలేని జగన్ రెడ్డి.. మాపైకి మాత్రం తెల్లారకముందే పోలీసుల్ని ఉసిగొల్పుతాడు.
ఎమ్మెల్సీని వదిలేయాలని, రూ.2కోట్లు ఇస్తామని మృతుడి కుటుంబంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బేరసారాలు జరిపాడా..లేదా? వైసీపీఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ని 24గంటల్లో అరెస్ట్ చేయకుంటే, టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా దళితులపక్షాన ఉద్యమిస్తుంది. జగన్ రెడ్డి మూడుసంవత్సరాల సినిమా అయిపోయింది.. ఇంకో సంవత్సరంలో వెళ్లి ఇంట్లో పడుకుంటాడు. ఇప్పటికే గడపగడపకు అని వెళితే ప్రజలు ఛీ కొట్టారు’’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు.