అమ్మఒడి, సంక్షేమ పథకాలు త‌గ్గించే కుట్ర‌ : లోకేష్

విడుద‌లైన టెన్త్ ఫ‌లితాల్లో విద్యార్థులు ఫెయిల్ కాలేద‌ని, జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం విద్యావ్య‌వ‌స్థ‌ని భ్ర‌ష్టు ప‌ట్టించి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఫెయిల్ అయ్యింద‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆరోపించారు. టెన్త్ ఫ‌లితాలు విడుద‌లైన నేప‌థ్యంలో 71 స్కూళ్ల‌లో ఒక్క‌రూ ఉత్తీర్ణులు కాక‌పోవ‌డం, 20 ఏళ్ల‌లో అతి త‌క్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత న‌మోదు కావ‌డంతో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ మీడియాకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి తాను ప‌దో త‌ర‌గ‌తి క‌ష్ట‌ప‌డి చ‌దివి పాసై ఉంటే, విద్యార్థుల క‌ష్టాలు తెలిసేవ‌ని ఎద్దేవ చేశారు. పరీక్షలు నిర్వహించడం దగ్గరనుంచి ఫ‌లితాలు ప్రకటించేవరకు అంతా అస్త‌వ్య‌స్తం, గందరగోళమేన‌న్నారు.

చ‌దువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్ని నాడు-నేడు ప‌నుల‌కి కాప‌లా పెట్ట‌డంతో వారు పిల్ల‌ల‌కి చ‌దువు చెప్ప‌డం మానేసి ఈ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యార‌న్నారు. నాడు నేడు అంటూ కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌చారం చేసుకుంటోన్న జ‌గ‌న్‌రెడ్డి 3500 కోట్లు దోచేశార‌ని, నాడు (2018) టిడిపి ప్ర‌భుత్వం నిర్వ‌హించిన టెన్త్ ప‌రీక్ష‌ల్లో  94.48  శాతం ఉత్తీర్ణ‌త సాధిస్తే, నేడు  67.26 శాతం దిగ‌జార‌డ‌మేనా వైసీపీ ప్ర‌భుత్వం సాధించిన ప్ర‌గ‌తి అని ప్ర‌శ్నించారు. బెండ‌పూడిలో ప‌దేళ్లుగా ప్ర‌సాద్ అనే టీచ‌ర్ ఎన్నారైల స‌హ‌కారంతో విద్యార్థినుల‌ను అమెరిక‌న్ ఇంగ్లీషులో మాట్లాడేలా తీర్చిదిద్దితే, ఆ ఘ‌న‌త త‌న‌ ఖాతాలో వేసుకున్న సీఎం..టెన్త్ దారుణ ఫ‌లితాలు కూడా త‌న ఖాతాలోనే వేసుకోవాల‌న్నారు.

పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల‌ను త‌న మ‌ద్యం బ్రాండ్లు అమ్మే షాపుల‌కి కాప‌లా పెట్టిన సీఎమ్మే దిగ‌జారిన ఫ‌లితాల‌కు ప్ర‌ధాన కార‌కుడ‌ని ఆరోపించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని సీపీఎస్ ర‌ద్దు, ఫిట్‌మెంట్ హామీల‌తో మోస‌గించ‌డంతో వారు ఆందోళ‌న‌ల‌తో రోడ్డెక్కి, బోధ‌న‌కి దూరం చేసింది జ‌గ‌న్ స‌ర్కారే అని మండిప‌డ్డారు. అధికారంలోకి రాకముందు ప్ర‌తీయేటా మెగా డీయస్సీలో టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తాన‌ని హామీ ఇచ్చి త‌ప్పిన సీఎం..ఈ మూడేళ్ల‌లో ఒక్క కొత్త టీచ‌ర్‌ని కూడా వేయ‌క‌పోవ‌డం వ‌ల్ల విద్యార్థుల‌కి చ‌దువు చెప్పేవారే లేక ఫ‌లితాలు దారుణంగా వ‌చ్చాయ‌న్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *