Nellore Box Office Report (నెల్లూరు బాక్స్ ఆఫీస్ విశ్లేషణ) November 1st Week

నెల్లూరు నగరంలో ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న చిత్రాల్లో సూపర్ హిట్ స్థాయిని ఏ చిత్రాలు కూడా అందుకోలేకపోతున్నాయి. నాగచైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ చిత్రం హిట్ స్థాయిని అందుకోగలిగింది కాని సూపర్ హిట్ అనే స్థాయిని చేరుకోలేకపోయింది. ప్రస్తుతం ఎస్ 2 సినిమాస్ మల్టీప్లెక్స్ లో ఈ చిత్రం రెండు ఆటలు మాత్రమే ఆడుతున్నది. గత వారంలో విడుదల అయిన చిత్రాల్లో కార్తీ నటించిన తమిళ అనువాద చిత్రం ‘కాష్మోరా’ అంతో ఇంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం ఎస్ 2 సినిమాస్ మరియు అర్చన థియేటర్ లలో ఈ చిత్రం నడుస్తున్నది. మరో తమిళ అనువాద చిత్రం ధనుష్ నటించిన ‘ధర్మయోగి’ కంటెంట్ పరంగా బాగున్నా ప్రచార లేమితో వెనక్కు పడిపోయింది. పబ్లిక్ టాక్ తోనే అంతోఇంతో జనాభా ఈ చిత్రం చూసేందుకు లీలామహల్ థియేటర్ కు వెళ్తున్నారు. నర్తకిలో ఆడుతున్న కళ్యాణ్ రామ్ ‘ఇజం’ భారీ ఫ్లాప్ గా మిగిలింది. హిందీ చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’ ఎస్ 2 సినిమాస్ లో ఒక ఆట ఆడుతూ హిందీ చిత్రాలను ఇష్టపడే వారిని ఆకట్టుకుంటున్నది. ఎస్ 2 సినిమాస్ లో ఈ వారం విడుదల అయిన సుమంత్ చిత్రం ‘నరుడా డోనరుడా’ ఫ్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. హిందీ చిత్రం ‘విక్కీ డోనర్’ అనువాద రూపం అయిన ఈ చిత్ర తెలుగు కంటెంట్ మరీ టీవీ సీరియల్ తీసినట్టు చీప్ గా తీసారు అనే టాక్ ఈ చిత్రానికి అడ్డంకిగా మారింది. సినిమా పేరు కూడా ఆకర్షణీయంగా లేకపోవడం మరో మైనస్. ఎస్ 2 సినిమాస్ లో రెండు ఆటలు ఆడుతున్న ఆంగ్ల చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్’ మల్టీప్లెక్స్ వర్గ ప్రేక్షకులకే పరిమితం. సిరి మల్టీప్లెక్స్ లో విడుదల అయిన మలయాళ అనువాద చిత్రం ‘పిల్ల రాక్షసి’ ఫీల్ గుడ్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. నెమ్మదిగా సాగే కథనం ఈ చిత్రానికి ప్రధాన మైనస్. ఇంక మన నెల్లూరులో చిత్రీకరణ జరుపుకుని ఈ వారం సిరి మల్టీప్లెక్స్ లో విడుదల అయిన చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’ ఘోరమైన రివ్యూలు మూటగట్టుకుని ఫ్లాప్ దిశగా సాగుతున్నది. మొత్తమ్మీద ఈ వారం  నెల్లూరు బాక్స్ ఆఫీస్ నిరాశాజనకంగా ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *