Nara Lokesh: దోచుకోవడం ఆపేసి.. ఇకనైనా అభివృద్ధి మొదలుపెట్టండి- నారా లోకేశ్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు మూడురాజధానుల విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశంలో ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అందుకు ధీటుగా సరికొత్త ప్రణాళికతో త్వరలోనే ముందుకొస్తామని పేర్కొంది. మరోవైపు ఇటీవలే విశాఖలో హెచ్ఎస్బీసీ కూడా మూతపడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజాగా, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అసలు మాటర్ లేని మూడు రాజధాల పేరు చెప్తూ.. జగన్ కాలక్షేపం చేస్తుంటే.. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా విరసిల్లిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని మండిపడ్డారు.
గత 15 ఏళ్లుగా వేలాది మంది ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోన్న హెచ్ఎస్బీసీని మూతబడేలా చేయడం బాధాకరమని అన్నారు లోకేశ్. రాష్ట్ర ప్రభుత్వం నియంతగా ప్రవర్తిస్తోందని.. వాళ్ల బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయని అన్నారు. ఇప్పుడు హెచ్ఎస్బీసీ మూతపడటం జగన్ అసమర్థతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో మోసం చేసింది చాలని.. విశాఖని దోచుకోవడం ఆపేసి.. ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు లోకేశ్. ఉన్న కంపెనీలనైనా ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చూడాలని జగన్‌ను కోరారు.