చెప్పుతో కొట్టుకున్న వైసీపీ నేతకు పేర్ని నాని చురకలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ పద్ధతి ఉందని, దాన్ని ఉపక్రమించిన ఏ ఒక్కరైనా క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకునేదిలేదని రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకటరామయ్య హెచ్చరించారు. పార్టీలో ఇష్టారీతిన నడుచుకుంటామంటే అధినాయకత్వం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా విభజన విషయంలో వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభ్యంతరాలు ఉంటే సీఎంకు, ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. పక్షం రోజుల క్రితం నరసాపురం ఎమ్మెల్యేగా ప్రసాదరాజును గెలిపించుకుని తప్పు చేశానంటూ సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఈ చర్యను మంత్రి పేర్ని నాని తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రసాదరాజును రాజకీయంగా పతనం చేసేందుకే సుబ్బారాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సుబ్బారాయుడు బాధ్యతాయుతమైన పదవులెన్నో నిర్వహించారని, చాలాకాలంగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని, ఆయన ఇలా మాట్లాడితే ఆయన విలువే తగ్గిపోతుందని సూచించారు. రాజకీయాలు కావాలంటే ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చన్నారు. భీమవరం కేంద్రంగా నరసాపురం జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అందులో ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.

ఏడు నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటుందనే ఎంపిక చేశాం. సుబ్బారాయుడికి అభ్యంతరాలుంటే సీఎంను కలిసి వివరిస్తే పద్ధతిగా ఉంటుందన్నారు. చెప్పుతో కొట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయంగా అడ్డు తొలగించుకుందామని సుబ్బారాయుడు ఆలోచన చేస్తే ప్రజలు అన్ని గమనిస్తారని పేర్కొన్నారు. నచ్చనప్పుడల్లా చెప్పుతో కొట్టుకోవాలంటే సుబ్బారాయుడు చాలాసార్లు చెప్పుతో కొట్టుకోవాలన్నారు. గతంలో టీడీపీలో ఉన్నసుబ్బారాయుడు, ఎన్నికల అనంతరం వైసీపీలో చేరాడు. ఏదో ఊహించి పార్టీలో చేరిన ఆయనను వైసీపీ పక్కనబెడుతోంది. దీంతో అసంతృప్తికి లోనైన కొత్తపల్లి జిల్లాల విభజనం అంశంలో తన చెప్పుతో కొట్టుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *