ఒక్కో కుటుంబానికి లక్ష ఆర్థిక సాయం : పవన్ కళ్యాణ్

చనిపోయిన రైతులను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుముందుకు వేశారు. అప్పులతో ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఉగాది పండుగ నాడు ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.  ఏపీలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాల, అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని అన్నారు.   వైసీపీ ప్రభుత్వం వచ్చాక 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ అంచనాల ప్రకారం 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని అన్నారు. అనధికారంగా దాదాపు 45 లక్షల మంది కౌలు రైతులున్నారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 80కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదని, వారికి కొంతైనా ఊరటను ఇవ్వాలనే ఉద్దేశంతో జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామని తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలనే రూ.లక్ష సాయం చేస్తున్నామని అన్నారు. త్వరలోనే ప్రతి కుటుంబాన్నీ పరామర్శించి, ఆర్థిక సాయం అందించే ప్రక్రియ మొదలు పెడతామని అన్నారు. తిండి గింజల్లో 80శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవేనని,  వారి బాధల గురించి వింటుంటే బాధగా ఉందన్నారు. కనీసం అధికారులు కూడా రైతుల ఆత్మహత్యలపై విచారించడం లేదని, ప్రతి కౌలు రైతుకు అండగా జనసేన ఉంటుందని చెప్పారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *